నెల్లూరు సిటీ: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ తప్పదని మంత్రులు సంకేతాలు ఇవ్వడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామా అంకయ్య అన్నారు. నెల్లూరులోని ఆర్టీసీ డిపో ఎదుట గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూ.300 కోట్ల విలువైన ఆర్టీసీ 2 డిపో ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. కాలుష్యం పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అయితే వాటిని ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా ఆర్టీసీ డ్రైవర్లతో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, నాయకులు సుధాకర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


