నెల్లూరు(టౌన్): జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్ ఆధ్వర్యంలో అమరావతి చాంపియన్‌షిప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాండు తెలిపారు. గురువారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం కాంప్లెక్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అండర్ 17, 23 విభాగాల్లో పురుషులు, మహిళలకు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పల్లిపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 29, 30 తేదీల్లో సర్వేపల్లి వారికి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో, ఆత్మకూరు వారికి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఉదయగిరికి వింజమూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలు జరగనున్నాయి. 30, 31 తేదీల్లో కందుకూరుకు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, 31, వచ్చే నెల ఒకటో తేదీన కావలికి స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో, నెల్లూరు సిటీకి ఏసీ స్టేడియంలో, వచ్చే నెల 3, 4 తేదీల్లో నెల్లూరు రూరల్‌కు స్టేడియంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. అండర్ 17 విభాగానికి 2009 ఆగస్ట్ 31 లేదా ఆ తర్వాత జన్మించిన వారు, అండర్ 23 విభాగానికి 2003 ఆగస్టు 31 లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు క్రీడా యాప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీల నిర్వహణకు ముందస్తుగా రూ.5 వేల అడ్వాన్స్ మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం చార్జీల రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సెట్నెల్ సీఈఓ నాగేశ్వరరావు, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గురుప్రసాద్, ఎస్‌జీఎఫ్ గేమ్స్ కార్యదర్శి బీవీ రమణయ్య, ఎం.దేవిక తదితరులు పాల్గొన్నారు.


