పేరు మహిళలది..పెత్తనం డీలర్లది | - | Sakshi
Sakshi News home page

పేరు మహిళలది..పెత్తనం డీలర్లది

Jul 23 2026 12:13 AM | Updated on Jul 23 2026 12:13 AM

నెల్లూరు(పొగతోట): జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకదుకాణాల నిర్వహణలో నిబంధనలు అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి. డీలర్లు లేని వాటిని స్వయం సహాయక సంఘాల (పొదుపు మహిళల) పేరుతో కేటాయించినప్పటికీ, వాస్తవానికి వాటిని మాజీ డీలర్లు లేదా ఇతరులే నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో సుమారు 160కిపైగా రేషన్‌ షాపులు డీలర్లు లేక ఖాళీగా ఉన్నాయి. రాజీనామాలు, 6ఏ కేసులు తదితర కారణాలతో ఖాళీ అయిన వాటిని తాత్కాలికంగా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. నిబంధనల ప్రకారం మూడు నెలల్లో కొత్త డీలర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఏళ్లుగా ఆ ప్రక్రియ చేపట్టలేదు. నెల్లూరు, కావలి, గూడూరు తదితర ప్రాంతాల్లో ఒకే డీలర్‌ మూడు నుంచి ఐదు వరకు షాపులను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెల్లూరులో ఓ వ్యక్తి ఆధ్వర్యంలో ఏకంగా ఎనిమిది దుకాణాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసినా రెవెన్యూ, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. నెలనెలా లంచాలు తీసుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రిజైన్‌ చేసిన చౌకదుదకాణాల వివరాలు ఆర్డీఓ వద్ద ఉంటాయి. వారు పరిశీలించి నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ సంవత్సరాల తరబడి ఇలా జరగడం లేదు.

అక్రమాలెన్నో..

ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రేషన్‌ పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. కొన్ని చౌకదుకాణాల్లో రేషన్‌ను లబ్ధిదారులకు పూర్తిగా పంపిణీ చేయకుండా, కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని మాఫియాకు, రైస్‌మిల్లులకు, హోటళ్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్డుదారుల నుంచి కిలో సుమారు రూ.12కు కొనుగోలు చేసిన బియ్యాన్ని హోటళ్లకు రూ.22కు, మాఫియాకు సుమారు రూ.17కు విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 1,513 చౌకదుకాణాలు ఉండగా, ప్రతినెలా సుమారు 12,500 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ అవుతోంది. ఇంత పెద్ద వ్యవస్థపై పర్యవేక్షణ లోపిస్తోందనే విమర్శలున్నాయి.

5వ తేదీకే నో స్టాక్‌

నిబంధనల ప్రకారం ప్రతినెలా సాధారణ కార్డుదారులకు 1 నుంచి 15వ తేదీ వరకు చౌకదుకాణాల ద్వారా రేషన్‌ పంపిణీ చేయాలి. 26 నుంచి 31వ తేదీ వరకు దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్ద అందజేయాలి. అయితే పోర్టబిలిటీ పేరుతో కొందరు డీలర్లు నెలలో 4 లేదా 5వ తేదీకే దుకాణాల వద్ద ‘నో స్టాక్‌’ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని విమర్శలున్నాయి. రేషన్‌ కోసం వెళ్లిన వారికి బియ్యం అయిపోయింది.. వచ్చే నెల తీసుకోండని వెనక్కి పంపుతున్నారు. 26 నుంచి 31వ తేదీ వరకు దివ్యాంగులు, వృద్ధులకు మాత్రమే బియ్యం ఇంటి వద్ద ఇవ్వాల్సి ఉంది. డీలర్లు వారికి కాకుండా బోగస్‌ కార్డులకు పంపిణీ చేస్తున్నారు. పోర్టబిలిటీ విధానాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. వీఆర్‌ఏలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొన్ని చౌకదుకాణాల్లో రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తంగా సాగుతోంది. దీనిపై రెవెన్యూ, సివిల్‌ సప్లైస్‌ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఖాళీ డీలర్‌ పోస్టులను భర్తీ చేయాలని కార్డుదారులు కోరుతున్నారు.

చౌకదుకాణాలపై పర్యవేక్షణ కరువు

నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం

డీలర్లకు వరం

జిల్లాలో 160కి పైగా దుకాణాలు ఖాళీ

పోర్టబిలిటీ పేరుతో అక్రమాలు

పక్కదారి పడుతున్న పేదల బియ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement