ఎలక్ట్రిక్‌ కారు ఢీకొని స్కూటీ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ కారు ఢీకొని స్కూటీ దగ్ధం

Jul 23 2026 12:13 AM | Updated on Jul 23 2026 12:13 AM

జంగాలకండ్రిగ వద్ద రోడ్డు ప్రమాదం

ఇద్దరికి తీవ్ర గాయాలు

ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని జంగాలకండ్రిగ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు వస్తున్న ఓ ఎలక్ట్రిక్‌ కారు ముత్తుకూరు వెళ్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. అదుపు తప్పిన కారు రోడ్డుపక్కన ఉన్న ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు ఢీకొన్న వెంటనే స్కూటీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాయుడుపేట మండలం యాకసిరి గ్రామానికి చెందిన పూండ్ల పవన్‌కుమార్‌, స్కూటీపై ప్రయాణిస్తున్న నార్తురాజుపాళెం సమీపంలోని రామన్నపాళేనికి చెందిన ఉదయగిరి కృష్ణయ్య తీవ్ర గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ సిబ్బంది నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు వివరాలు తెలియాల్సి ఉంది.

ఆక్వా మందుల

దుకాణంలో తనిఖీలు

రూ.లక్ష జరిమానా

ఇందుకూరుపేట: మత్స్య శాఖ అధికారులు మండలంలోని కుడితిపాళెంలో ఆక్వా దుకాణంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. సీఏఏ అనుమతుల్లేని నాలుగు రకాల మందులను గుర్తించి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆ శాఖ ఏడీ చాన్‌బాషా, ఎఫ్‌డీఓ సురేష్‌ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు లేని మందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆక్వా రైతులు మందులను పరిశీలించి సక్రమంగా ఉంటేనే వాటిని వినియోగించుకోవాలన్నారు. లేకుంటే నష్టాలు పాలవుతారని వాపోయారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

చిల్లకూరు: మండలంలోని తిప్పగుంటపాళెం గ్రామంలో ఓ వ్యక్తి బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిప్పగుంటపాళెం సమీపంలో ఉన్న రొయ్యల గుంతలను విజయవాడకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వాటి వద్ద స్థానిక గిరిజన కాలనీకి చెందిన రాపూరు వెంకటేశ్వర్లు (42) కాపలాగా ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ అతను గుంతల వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు గుర్తించి తాగిన మందును కక్కించి ఇంటికి పంపారు. అయితే కాసేపటికి వెంకటేశ్వర్లు మృతిచెందాడు. దీనిపై గిరిజన కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

నిమ్మ

ధరలు (కిలో)

పెద్దవి : రూ.60

సన్నవి : రూ.30

పండ్లు : రూ.15

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement