పనికెళ్లి.. కానరాని లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

పనికెళ్లి.. కానరాని లోకాలకు..

Jul 23 2026 12:13 AM | Updated on Jul 23 2026 12:13 AM

పొగాకు బేళ్లు పడి కూలీ మృతి

ఆదుకుంటామని బోర్డు అధికారుల హామీ

కలిగిరి: అతను ఉదయం ఇంట్లో భార్యాపిల్లలకు చెప్పి పనికొచ్చాడు. కానీ అదే ఆఖరి మాటైంది. అనుకోని ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మండలంలోని కలిగిరిలో పొగాకు వేలం కేంద్రంలో ఆగి ఉన్న లారీలో లోడు చేసిన పొగాకు బేళ్లు పడి మెంతం శివకోటిరెడ్డి (52) అనే కూలీ మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కలిగిరి కొత్తూరుకు చెందిన శివకోటిరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. అతను 20 సంవత్సరాలపాటు వేలం కేంద్రంలో హమాలీగా పనిచేశాడు. ఈ సంవత్సరం మేసీ్త్రలు పిలిస్తే పనులకు వెళ్తున్నాడు. బుధవారం గోదాములోని పొగాకు బేళ్లను సహచర కూలీలతో కలిసి లారీల్లో లోడ్‌ చేశాడు. ఐటీసీ కంపెనీ లారీలు బోర్డు ప్రాంగణంలోకి రోడ్డుపైకి వచ్చాయి. శివకోటిరెడ్డి మంచినీరు తాగేందుకు ఆఫీస్‌ గది వద్దకు లారీ పక్కగా వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఆరు బేళ్లు అతడిపై పడ్డాయి. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

నిర్లక్ష్యం వల్లే..

శివకోటిరెడ్డి మృతివిషయం తెలుసుకుని జెడ్పీటీసీ సభ్యుడు పాలూరు మాల్యాద్రిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కాటం రవీంద్రారెడ్డి, మృతుడి బంధువులు భారీ సంఖ్యలో వేలం కేంద్రానికి చేరుకున్నారు. లారీలో లోడ్‌ చేసిన పొగాకు బేళ్లకు మోకులు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అతను చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వేలం నిర్వహణాధికారి జి.రాజశేఖర్‌, రైతు సంఘాల నాయకులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చించారు. బోర్డు, రైతుల తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కలిగిరి సీఐ పి.సుబ్బారావు, ఎస్సై లతీఫున్నీసా, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే బోర్డు అధికారులు, రైతులు, మృతుల కుటుంబ సభ్యులతో చర్చించారు. పూర్తి న్యాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరితో కలివిడిగా ఉండే శివకోటిరెడ్డి మృతితో కలిగిరిలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement