● జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ
సమావేశంలో కలెక్టర్
నెల్లూరురూరల్: ‘పంటల బీమా అమలులో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అర్హత ఉన్న రైతులు నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. బుధవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో పంటల బీమా పథకాల అమలుపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి పంటకు ఎకరాకు రూ.42,000 బీమాకు రైతు వాటా రూ.840 అన్నారు. చివరి తేదీ ఆగస్టు 15వ తేదీ అని తెలిపారు. వేరుశనగకు రూ.28,000కు రైతు వాటా రూ.280 కాగా, చివరి తేదీ జూలై 31, పత్తికి రూ.40,000కు రైతు వాటా రూ.2,000, చివరి తేదీ జూలై 24, నిమ్మకు రూ.48,000 బీమా మొత్తానికి అన్నదాత వాటా రూ.2,400 అని, చివరి తేదీ జూలై 24గా నిర్ణయించినట్లు వివరించారు. ప్రీమియం చెల్లింపు, బీమా నమోదు గడువులు, పథకాల ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఖరీఫ్ 2024 వరకు ఉచిత పంటల బీమా అమలులో ఉండగా, రబీ 2024 – 25 నుంచి రుణగ్రహీత, రుణేతర రైతులకు స్వచ్ఛంద నమోదు విధానం అమలులో ఉందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంట రుణం పొందిన అన్నదాతలు బీమాకు అర్హులన్నారు. బ్యాంక్‌లు, సాధారణ సేవా కేంద్రాలు, జాతీయ పంటల బీమా నమోదు వేదిక, గ్రామ సచివాలయాలు, తపాలా కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారిణి పి.సత్యవాణి, జిల్లా ఉద్యాన అధికారి కె.అనురాధ, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి డాక్టర్ బాబు, లీడ్ జిల్లా మేనేజర్ మునిశేఖర్, జిల్లా ప్రణాళికాధికారి లక్ష్మీనరసింహులు తదితరులు పాల్గొన్నారు.


