● అనారోగ్యానికి గురైన డ్రైవర్
● రోడ్డు పక్కన బస్సు నిలిపివేత
● 45 మంది ప్రయాణికుల క్షేమం
సంగం: మండలంలోని సంగం సమీపంలో ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ అప్రమత్తమవడంతో ఘోర ప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. బుధవారం పామూరు నుంచి 45 మంది ప్రయాణికులతో నెల్లూరుకు ఆర్టీసీ బస్సు వస్తోంది. డ్రైవర్ త్రిమోటి ప్రయాణ మధ్యలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. అతను స్టీరింగ్‌పై వాలిపోయేలోపు బస్సును రోడ్డు పక్కకు సురక్షితంగా నిలిపివేశాడు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను సంగం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలిపారు. డ్రైవర్ కర్తవ్యదీక్షతో వ్యవహరించడంతో 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కండక్టర్ ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేయగా, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.


