● కొనసాగిన డాక్యుమెంట్ రైటర్ల నిరసన
● మూడోరోజు 32 రిజిస్ట్రేషన్లే..
నెల్లూరు సిటీ: ‘అయ్యా ప్రభుత్వ పెద్దలూ.. 396 జీఓతో మా పొట్ట కొట్టొద్దు. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. నెల్లూరులోని ప్రధాన రిజిస్ట్రేషన్ (ఆర్‌ఓ) కార్యాలయం వద్ద బుధవారం వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పట్నం దుర్గేష్‌బాబు మాట్లాడుతూ ఏళ్ల తరబడి కేవలం ఈ వృత్తిపై ఆధారపడి వందల మంది జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వం కనీసం వారి పరిస్థితిని ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రూ.27 లక్షలే..
జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం 32 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. 396 జీఓను వ్యతిరేకిస్తూ రైటర్లు ఈనెల 20వ తేదీ నుంచి పెన్‌డౌన్ చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రోజూ 100 నుంచి 150కి పైగా రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉండగా ఆ సంఖ్య తగ్గింది. 32 రిజిస్ట్రేషన్లకు రూ.27 లక్షలు మాత్రమే ఆ శాఖకు ఆదాయం వచ్చింది.


