● రాజకీయ విమర్శలకు
దారితీసిన ఆందోళన
● పెంచి పోషించింది మీరేనంటున్న ప్రజలు
ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు ప్రధాన రహదారిపై అధిక లోడ్‌తో బూడిద బల్కర్లు సంచరిస్తుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ బ్రహ్మదేవిలోని జెన్‌కో రోడ్డు వద్ద నిరసనను టీడీపీ నేతలు బుధవారం చేపట్టారు. సామర్థ్యానికి మించి తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. ఇదే అంశమై పల్లె వీక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. 30 టన్నుల సామర్థ్యంతో వెళ్లాల్సిన బల్కర్లు 80 టన్నులతో రాకపోకలు సాగిస్తున్నాయని, దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రహదారులు దెబ్బతింటున్నాయన్నారు. ముత్తుకూరు మెయిన్ రోడ్డుపై రాకపోకలకు అనుమతివ్వకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఇదెక్కడి చోద్యం..?
నిన్నామొన్నటి వరకు బూడిద బల్కర్ల రాకపోకలను అధికార పార్టీ నేతలు ప్రోత్సహించి, ఇప్పుడు ఇదే అంశంపై నిరసనలు చేపట్టి నియంత్రణ కోరడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శించారు. వీరి అండదండలతోనే ఇంతకాలం బల్కర్లు ఇష్టారాజ్యంగా తిరిగాయని ఆరోపించారు. మరోవైపు టీడీపీ నేతల ఆందోళన మండలంలో చర్చనీయాంశంగా మారింది.


