● ఉపాధ్యాయుడు రాక మూతబడిన పాఠశాల
చిల్లకూరు: తమ పిల్లలను బడికి పంపితే మధ్యాహ్నం ఓ ముద్ద బువ్వైనా తింటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వదిలెళ్తుంటారు. అయితే పాఠశాలకు సకాలంలో రావాల్సిన అయ్యోర్లు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో చిన్నారులకు ఆకలి కేకలు తప్పడం లేదు. ఇలాంటి ఘటనే గూడూరు రూరల్ పరిధిలోని కుందకూరు గిరిజన కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.
డిప్యుటేషన్‌పై రోజుకొకరు..
గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి డిప్యుటేషన్‌పై రోజుకొకర్ని విద్యాశాఖ పంపుతోంది. ఈ క్రమంలో ఒకరికి ఆదేశాలివ్వాల్సిన అధికారులు, అందుకు భిన్నంగా మరొకరికి ఇవ్వడంతో ఆయన బడికే వెళ్లలేదు. దీంతో బడి తెరుచుకోకపోవడంతో ఉన్న ఆరుగురు గిరిజన పిల్లలు ఆకలితో అలమటించిపోయారు.
అటకెక్కుతున్న చదువులు
మారుమూల ఉన్న గిరిజన కాలనీలోని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ అంశమై గూడూరు ఎంఈఓ మాధవరావును సంప్రదించగా, డిప్యుటేషన్ పంపే విషయంలో కొద్దిగా మార్పులు చోటుచేసుకోవడంతో పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని బదులిచ్చారు.


