పెట్టిందే తిను.. చెప్పిందే విను | - | Sakshi
Sakshi News home page

పెట్టిందే తిను.. చెప్పిందే విను

Jul 21 2026 12:05 AM | Updated on Jul 21 2026 12:05 AM

వింజమూరు(ఉదయగిరి): వింజమూరులోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, అనవసరంగా అసభ్యపదజాలంతో దూిషించమే కాకుండా కొడుతున్నారని ఆరోపిస్తూ వార్డెన్‌ ఎన్‌ భాస్కర్‌రావు తీరుపై విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థులకు ఎమ్మార్పీఎస్‌, విద్యార్థి సంఘాలు మద్దతు తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.

వార్డెన్‌ తీరుపై ఆరోపణలు

ఎస్సీ బాలుర వసతి గృహ వార్డెన్‌గా భాస్కర్‌రావు నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వసతిగృహంలో 85 మంది విద్యార్థులు ఉండగా, రాత్రి వేళల్లో 50 మంది మాత్రమే ఉంటున్నారు. మిగిలిన విద్యార్థులు ఇళ్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతిరోజూ విద్యార్థుల ముఖహాజరును తీసుకుని అందరూ ఉన్నట్లుగా చూపించి వార్డెన్‌ సరుకులు మెక్కెస్తున్నాడు. అంతేకాకుండా సెలవు రోజుల్లో సైతం ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల గ్రామాలకు వెళ్లి మరీ హాజరు వేసుకుని సరుకులు మింగేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా కోడి గుడ్లు, బియ్యం, తదితరాలు స్వాహా చేస్తున్నాడు. దీనిపై ప్రశ్నించిన విద్యార్థులను టార్గెట్‌ చేస్తూ బూతులు తిట్టడం..కొట్టడం చేస్తుండడంతో వారు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో ఆదివారం వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ మేకపాటి శాంతకుమారికి పలువురు విద్యార్థులు తమ బాధలను ఏకరువు పెట్టారు. దీంతో ఫిర్యాదు చేసిన విద్యార్థులను గుర్తించి వార్డెన్‌ తీవ్రంగా దూషించాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు సోమవారం వసతిగృహం వద్దకు రాగా వార్డెన్‌ వారిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా వారికి మద్దతుగా నిలబడి వార్డెన్‌పై తిరుగుబాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి వార్డెన్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థులు వసతిగృహం ఎదుట, మెయిన్‌రోడ్డుపై బైఠాయించి వార్డెన్‌ను వెంటనే సస్సెండ్‌ చేయాలని ఆందోళన చేపట్టారు. వీరికి ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పందిటి అంబేడ్కర్‌ మాదిగ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మహంత్‌రెడ్డి మద్దతు తెలిపారు. వార్డెన్‌ తీరుపై జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయగిరి, ఆత్మకూరు ఏస్‌డబ్ల్యూఓలు గీతాదేవి, రమణారెడ్డి, స్థానిక ఎస్సీ బాలికల వసతిగృహ మేట్రిన్‌ భారతి, ఏఎస్సై జయపాల్‌, కొండాపురం ఎస్సై శ్రీనివాసరావు వసతి గృహానికి వచ్చి విద్యార్థులు, నేతలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది.

ఏఎస్‌డబ్ల్యూఓ విచారణ

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి ఆదేశాల మేరకు ఏఎస్‌డబ్ల్యూఓ గీతాదేవి విద్యార్థులు, వసతిగృహ సిబ్బంది, వార్డెన్‌ నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నామని, వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కాగా వార్డెను తీరును డీడీ శోభారాణి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో సీరియస్‌ అయినట్లు సమాచారం. వార్డెన్‌పై సస్పెండ్‌ వేటు వేయడమా లేదా వేరే చోటుకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ ఎస్సీ బాలుర హాస్టల్‌ వార్డెన్‌ తీరు

విసిగిపోయి ఆందోళన చేపట్టిన విద్యార్థులు

వసతిగృహం ఎదుట,

మెయిన్‌ రోడ్డుపైన బైఠాయించి నిరసన

సంఘీభావం తెలిపిన

ఎమ్మార్పీఎస్‌, విద్యార్థి సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement