● తప్పుడు ప్రచారాలు తప్ప.. నిష్ప్రయోజనం
● ఉపాధి పనులు దక్కక కూలీలు అవస్థలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా అభివృద్ధి, సంక్షేమం కరువైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని పూడిపూర్తిలో కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు కాకాణిని కలిసి కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడం, గ్రామాలు అభివృద్ధి చేయడంతో తాము చాలా సంతోషంగా జీవించామని, కానీ కూటమి పాలనలో తమ సమస్యలు అధికారులకు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుకు అధిక ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ.3 వేల పింఛన్‌ను రూ.4 వేలు చేశామని గొప్పలు తప్ప, కొత్తగా ఒక్క పింఛన్ మంజూరు చేయకపో గా, ఉన్న పింఛన్లకు కోత విధించారన్నారు. గతంలో మంజూరైన ఫించన్లలో కొన్నింటిని వివిధ కారణాల పేరుతో తొలగించి వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. జగనన్న పాలనలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు పనులు కల్పించి వారికి అండగా నిలవడం జరిగిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉపాధి పనులు చేయడానికి వీల్లేదని కూటమి నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఉపాధి పనులు దక్కకపోవడంతో గిరిజనులు ఉపాధి కోసం దగ్గరలోని పరిశ్రమల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పూడిపర్తి ఎస్సీ కాలనీలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి సమస్యను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రత్యేక బో ర్ల ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. గిరిజన కాలనీలోని 52 కుటుంబాలకు నూతన ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ఇళ్లకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో గిరిజనులు అసంపూర్తిగా ఉన్న ఇళ్లలోనే నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతకు ముందు పూడిపర్తి గ్రామ మాజీ ఉప సర్పంచ్ సురేష్ తండ్రి ఇటీవల మరణించగా, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మండల వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, పార్టీ మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, ఎంపీటీసీలు వేమారెడ్డి రఘునందన్ రెడ్డి, కోడూరు రఘునాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు కొణిదెన విజయభాస్కర్‌నాయుడు, డక్కిలి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.


