వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో సోమవారం నిర్వహించిన పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని వీఎస్‌యూ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ఆర్ మధుమతి తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 1039 మందికి గాను, 929 మంది హాజరయ్యారు. 110 మంది గైర్హాజరయ్యారు. గూడూరు డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో ఒక విద్యార్థి డిబార్ అయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1119 మందికి గాను, 1034 మంది హాజరయ్యారు. 85 మంది గైర్హాజరయ్యారు. నెల్లూరులోని వీఆర్ ఐపీఎస్ కళాశాలలో ఒక విద్యార్థి డిబార్ అయినట్లు ఆమె తెలిపారు.
కిలో పొగాకు
గరిష్ట ధర రూ.250
మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 లభించింది. వేలానికి 486 బేళ్లు రాగా, 378 బేళ్లను విక్రయించారు. మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. వేలంలో కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.160, సగటున రూ.207.89 ధర పలికిందని వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలంలో 8 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లాలో 9.7 మి.మీ.
వర్షపాతం
నెల్లూరు(అర్బన్): ఎండలతో అల్లాడిన జిల్లా వాసులను సేద తీరుస్తూ రెండ్రోజులుగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు కాగా , మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో సరాసరిన 9.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తోటపల్లిగూడూరు 35.0, చిల్లకూరు 33.4, రాపూరు 32.2, ఇందుకూరుపేట 25.4, గూడూరు 23.8, కోట 23.8, పొదలకూరు 22.2, ముత్తుకూరు 20.4, నెల్లూరు రూరల్ 20.4, నెల్లూరు సిటీ 20.4, వెంకటాచలం 18.4, సైదాపురం 16.6, కోవూరు 14.0,మనుబోలు 13.8, బుచ్చిరెడ్డిపాళెం 9.4, విడవలూరు 9.4, సంగం 4.2, కావలి 2.0, కొడవలూరు 1.8, దగదర్తి 1.6 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో వర్షం కురవలేదు.
డాక్యుమెంట్ రైటర్ల నిరసన
● రిజిస్ట్రేషన్ శాఖకు
ఒక్క రోజే రూ.కోటి మేర నష్టం
నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 396ను వ్యతిరేకిస్తూ జిల్లాలోని డాక్యుమెంట్ రైటర్లు సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్‌కు అప్పగిస్తే ఏళ్ల తరబడి ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తాము జీవనోపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రతిరోజూ జిల్లాలో 100 నుంచి 150 వరకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సుమారు రూ.కోటి నుంచి రూ.1.50 కోటి వరకు ఆదాయం వస్తుంది. డాక్యుమెంట్ రైటర్ల నిరసనతో సోమవారం కేవలం 45 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. రూ.39 లక్షలు మాత్రమే రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం వచ్చింది. దీంతో ఒక్కరోజే రూ.కోటి మేర నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,956 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,040 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో రూ.4.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
కార్పొరేషన్ అసిస్టెంట్
కమిషనర్‌గా రేష్మ
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్‌గా షేక్ రేష్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్–2 ద్వారా ఉద్యోగాన్ని సాధించిన ఆమె తొలుత కార్పొరేషన్ కమిషనర్ నందన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని పూలమొక్కను అందజేశారు.


