● ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియా ప్రతినిధులను బదనాం చేస్తారా ?
● మనుబోలు లాకప్ డెత్ విషయంలో మీడియాకు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం
● వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తే వేధించడం దుర్మార్గం
● ఎమర్జెన్సీ సమయంలో కూడా జిల్లాలో మీడియాకు నోటీసులివ్వలేదు
● రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్ నిరంకుశ పాలన సాగిస్తున్నారు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: ఈ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్ పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా గొంతు నొక్కాలనుకోవడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు, అధికార పార్టీ నాయకులు సాగిస్తున్న అప్రజాస్వామిక చర్యలను, దాష్టీకాలను వెలుగులోకి తెస్తున్న మీడియాను బెదిరించేందుకు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. మండలంలోని పూడిపర్తిలో కాకాణి సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌లకు మీడియా భయపడదని, వాళ్లను వేధిస్తే పదిరెట్లు ఘాటుగా స్పందిస్తారనే విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం తీవ్రంగా దిగజారిపోయి, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మనుబోలు పోలీసుల చేసిన లాకప్ డెత్‌కు సంబంధించి ప్రసారాలు చేసిన మీడియా, జర్నలిస్టులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని ఖండించారు. నోటీసులు ఇచ్చి ఆ వార్తకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాలనడం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్‌లు చేసి జైలుకు పంపడం చూస్తున్నామన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్ ప్రచురించిన వార్తలపై ప్రశ్నించే ధైర్యం పోలీసులకు ఉందా అని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే నోటీసులు ఇచ్చి వేధించడం ఎమర్జెన్సీ కాలంలో కూడా మీడియాపై ఇంత దారుణ పరిస్థితులు లేవన్నారు. తప్పులు చేయడం మానుకుంటే మీడియా కూడా స్పందించదన్నారు. మీరు తప్పులు, దుర్మార్గాలు చేస్తున్నారు కాబట్టే మీడియా తన బాధ్యతగాప్రజలకు చూపిస్తుందన్నారు. ఇప్పటికై నా మీడియాపై కక్ష సాధింపు చర్యలనుు మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.


