కోట: కోటలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)గా మార్చాలని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రానికే గురుకులాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులకు సమాచారం అందించి పిల్లల్ని తీసుకెళ్లాలని కోరారు. దీంతో గురుకులం వద్ద ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కోటను ఎంపిక చేసింది.
వద్దని కోరినా..
వేసవి సెలవుల్లోనే కోట గురుకులాన్ని సీఓఈ కేంద్రంగా మార్చే ప్రతిపాదనను అధికారులు పరిశీలించారు. అప్పట్లో దళిత సంఘాలు, పూర్వ విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే ఈసారి గడువు ఇవ్వకుండా ఒక్కరోజులోనే ఖాళీ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం ఇక్కడున్న 455 మంది పాఠశాలల, 160 మంది కళాశాలల విద్యార్థులను వాకాడు, నాయుడుపేట, చిల్లకూరు ఎస్సీ గురుకులాలు, చిట్టేడు ఎస్టీ గురుకులంలో సర్దుబాటు చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే 70 మంది బోధన, బోధనేతర సిబ్బందిని ఇతర గురుకులాలకు బదిలీ చేశారు.
ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు?
ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో ఎస్సీ గురుకులాన్ని ఎత్తేస్తుంటే ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఏం చేస్తున్నారని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 1987లో గురుకులం ఏర్పాటుకాగా వేలాది మంది పేద పిల్లలు చదువుకున్నారు. అలాంటి విద్యాసంస్థను అకస్మాత్తుగా రద్దు చేయడాన్ని అంగీకరించబోమని వారు చెబుతున్నారు. నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాన్ని మరోచోట ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉందంటున్నారు. దీని కోసం కోట, చిల్లకూరు మండలాల్లో ప్రభుత్వ భవనాలు పరిశీలించారు. చివరకు కోట గురుకులాన్ని రద్దు చేసి ఇక్కడ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించి కోట గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఆ గురుకులాన్ని 1987లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంతోమంది పేద పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కరోజులోనే దాని కథ ముగిసింది. సీఓఈ కేంద్రంగా మార్పు చేస్తున్నట్లుగా ప్రకటించి విద్యార్థులను తీసుకెళ్లిపోవాలని చెప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోటలో అంబేడ్కర్ గురుకులం ఎత్తివేత
సీఓఈ కేంద్రంగా మార్పు
అధికారుల నిర్ణయంపై తల్లిదండ్రుల మండిపాటు
ఉపసంహరించుకోవాలంటున్న
దళిత సంఘాలు


