● డీఆర్వో విజయకుమార్
నెల్లూరు రూరల్: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి, డీఆర్వో విజయకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు చేసిన పౌరులు తమ సమస్యల పరిష్కారంపై అభిప్రాయాలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రీవెన్స్ కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా విస్తృ తంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
నేడు ‘డయల్ యువర్ ఎస్‌ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని ఎస్‌ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.
● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్‌కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.
గిరిజన యువతకు
ఉచిత శిక్షణ
నెల్లూరు(వేదాయపాళెం): హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ వారు గిరిజన యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో రెండు నుంచి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తారన్నారు. వసతి, భోజన సదుపాయంతోపాటు స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తారన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఎన్‌ఎస్‌డీసీ సర్టిఫికెట్‌తో పాటు ప్రముఖ పరిశ్రమలలో ఉద్యోగావకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 81878 99877 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి
ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలోని పడకండ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ముందస్తుగా అందిన సమాచారంతో ఎస్సై జంపాని కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. కోడిపందేల్లో పాల్గొంటున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రూ.7,140 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలు, పేకాట తదితర జూద కార్యకలాపాలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
రైలు కిందపడి..
● గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులోని సౌత్ రైల్వేస్టేషన్ చైన్నె వైపు వెళ్లే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. బూడిద రంగు ఆఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఘటనా స్థలాన్ని నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో
28.20 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 28.20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


