వైద్యులు సేవా భావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు సేవా భావంతో పనిచేయాలి

Jul 19 2026 11:56 PM | Updated on Jul 19 2026 11:56 PM

మెడికోస్‌ రాష్ట్ర కన్వెన్షన్‌లో వక్తలు

నెల్లూరు(అర్బన్‌): పేద, ధనిక తేడాల్లేకుండా సేవా భావంతో డాక్టర్లు పనిచేయాలని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్‌ మెడికల్‌ కళాశాల లెక్చరర్స్‌ గ్యాలరీలో జనవిజ్ఞానవేదిక, కళాశాల జనరల్‌ సర్జరీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ మెడికోస్‌ కన్వెన్షన్‌ – 2026 జరిగింది. ఈ సందర్భంగా సమాజంలో వైద్యుల పాత్రపై జేవీవీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన డాక్టర్‌ బ్రహ్మారెడ్డి, సమాజహితం కోసం పనిచేసిన ప్రముఖ వైద్యులు అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, వైద్యరంగం అభివృద్ధిలో జీవపరిణామ సిద్ధాంతం పాత్రపై డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. వైద్యం ఎలా అభివృద్ధి చెందిందో, గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఏ రూపంలో ఉందో వివరించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే కార్పొరేట్‌, ప్రైవేట్‌ శక్తుల కబంధ హస్తాల్లోకి పోతుందన్నారు. అప్పుడు డబ్బులున్న వారికే వైద్య సేవలందుతాయన్నారు. ఈ స్థితి మారాలంటే వైద్యరంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల పరీక్షలు, పరికరాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఆహార లోపం, కలుషిత నీరు, కాలుష్యం, రసాయనాల వల్లనే జబ్బులు వస్తున్నాయని తెలిపారు. వాటికి పరిష్కారాలు వివరించారు. అనంతరం జూనియర్‌ వైద్య విద్యార్థులకు సీపీఆర్‌ గురించి వెల్లడించారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజేశ్వరి, డాక్టర్‌ మణికుమార్‌, జేవీవీ రాష్ట్ర నాయకులు డా.కాలేషా సాహెబ్‌, ఆరోగ్యసబ్‌ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ శ్రీనునాయక్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ చలపతి, విజయకుమార్‌, ప్రజారోగ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎంవీ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.రాజేశ్వరరావు, డాక్టర్‌ రఫీ, విజయమ్మ, ఏసీఎస్‌ఆర్‌, నారాయణ, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, కడప తదితర ప్రాంతాల మెడికోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement