నెల్లూరు(క్రైమ్): నెల్లూరు పొర్లుకట్ట శివాలయం సమీప పెన్నానదిలో ఆదివారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు వైఎస్సార్ నగర్‌లో షేక్ అబ్దుల్ సలాం అలియాస్ అబ్దుల్లా నివాసం ఉంటున్నాడు. అతను ఆదివారం ఐదుగురు స్నేహితులతో కలిసి కొత్తకోడూరు బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో స్నానం చేసిన అనంతరం మంచినీటిలో స్నానం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. అందరూ నెల్లూరు పొర్లుకట్ట శివాలయం సమీప పెన్నానది వద్దకు చేరుకున్నారు. ఒడ్డున భోజనం చేశారు. అనంతరం అబ్దుల్ సలాం స్నానం చేసేందుకు నదిలో దూకాడు. నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న సంతపేట ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో అబ్దుల్ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబానికి సమాచారం అందించారు.


