ప్రమాదానికి గురైన బస్సు (ఫైల్)
సంగం: వారణాశి యాత్ర నిమిత్తం బయల్దేరి బిహార్‌లోని గయా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుప్పించిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఘటన జరిగిన 40 రోజులైనా నేటికీ పరిహారం అందకపోవడంతో క్షతగాత్రుల అవస్థలు వర్ణనాతీతమవుతున్నాయి. అసలీ మొత్తం వస్తుందాననే సందేహాలు వీరిలో వ్యక్తమవుతున్నాయి.
నాడు ఆర్భాటంగా..
జిల్లాలోని సంగం, ఆత్మకూరు, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన 43 మంది భక్తులు ఉత్తరాది రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాల దర్శనానికి శ్రీసాయి యాత్ర స్పెషల్ బస్సులో బయల్దేరారు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో బిహార్‌లోని గయా సమీపంలో ఎదురుగా వచ్చిన లారీని వీరు ప్రయాణిస్తున్న బస్సును గత నెల ఎనిమిదిన ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి శస్త్రచికిత్సలూ చేయాల్సి వచ్చింది. కొందరు పాక్షిక గాయాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటన అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు.. తీవ్రంగా గాయపడిన వారికి రూ.రెండు లక్షలు.. పాక్షికంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు సైతం చెప్పినా, నేటికీ పరిహారం అందించే దిశగా ఎవరూ చొరవ చూపడంలేదు.
వైద్యానికి అప్పులు..
తీవ్రంగా గాయపడిన పలువురు ఇప్పటికీ కోలుకోలేదు. కొందరి కాళ్లు, చేతులకు శస్త్రచికిత్సలు జరిగి ఇంటి వద్ద విశ్రాంతి పొందుతుండగా, మరికొందరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఉపాధి కోల్పోయి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలూ ఉన్నాయి. పరిహార విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులను పలుమార్లు సంప్రదించినా, స్పష్టమైన సమాధానం కొరవడుతోందని బాధితులు వాపోతున్నారు. ప్రక్రియ కొనసాగుతోందనే జవాబు తప్ప, పరిహారం ఎప్పుడందుతుందనే అంశాన్ని చెప్పడంలేదు.
వారణాశి ప్రమాద బాధితులకు
మంత్రి ఆనం హామీ
40 రోజులైనా నేటికీ దిక్కులేని వైనం
ప్రకటనలతో ప్రభుత్వ ఆర్భాటం
మంచానికే పరిమితమైన క్షతగాత్రులు
వైద్య ఖర్చులకు నానా అవస్థ
ఎందుకీ పరిస్థితో..?
మంత్రి ప్రకటించిన హామీ అమల్లో ఎందుకు జాప్యం జరుగుతోందో అంతుచిక్కడంలేదు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యమా.. లేక పరిపాలన లోపమాననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయాన్ని అందజేసి తమ కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.


