అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా నిరాకరణ | - | Sakshi
Sakshi News home page

అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా నిరాకరణ

Jul 19 2026 12:27 AM | Updated on Jul 19 2026 12:27 AM

సాక్షిప్రతినిధి, నెల్లూరు/కందుకూరు: పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కందుకూరు ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌తో కలిసి చేపట్టిన ‘చలో రామాయపట్నం పోర్టు’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం పక్కా వ్యూహంతో కుట్రలకు తెర లేపింది. డీఎస్పీలు, సీఐలు, పదుల సంఖ్యలో ఎస్సైలు వందలాది మంది పోలీసులు మోహరించి వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోర్టు దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. పోర్టు నిషిద్ధ ప్రాంతమన్నట్లుగా ఎవరూ వెళ్లకుండా ఎన్‌హెచ్‌– 16 రహదారి నుంచి చేవూరు మీదుగా పోర్టులోకి వెళ్లే రహదారిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. పోర్టుకు కిలోమీటర్‌ దూరంలోనే రోడ్డుకు అడ్డంగా ఎత్తైన ఇనుప రేకులతో భారీ అడ్డుగోడ కట్టారు. పోర్టు పనులకు వినియోగించే టిప్పర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. పోలీసుల చర్యలను, సృష్టించిన అడ్డంకులను చూసి అక్కడికి వచ్చిన వారందరూ ఆశ్చర్యపోయారు. పోర్టు సందర్శనకు వెళ్తుంటే దేశ సరిహద్దులో ఏర్పాటు చేసిన విధంగా ఇంత అడ్డగోడలు ఏంటంటూ విస్తుపోయారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన చలో రామాయపట్నం పిలుపు ప్రభుత్వంలో వణుకు పుట్టించినట్లు అర్థమవుతుందన్నారు. పోర్టు నిర్మాణం సక్రమంగా జరుగుతుంటే.. పోర్టు నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంటే.. ప్రభుత్వం అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పోర్టు అధికారులకు సందర్శనకు తమకు అనుమతి లేదని లెటర్‌ ఇచ్చారని, వారి ఆదేశాల మేరకు ఎవర్నీ అనుమతించడం లేదంటూ పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

పోర్టు ప్రైవేటీకరణ నేపథ్యంలో పోర్టు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్‌యాదవ్‌.. పోలీసులకు పది రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా తన సొంత మెయిల్‌ ద్వారా పోర్టు సీఈఓకు అనుమతి కోరుతూ లేఖ పంపారు. ఇదే విషయాన్ని పోలీసులు అడ్డుకున్న సందర్బంలో కాకాణి బహిర్గతం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోర్టు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారు. పోర్టు అధికారులకు చేసిన విన్నపానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.20 గంటల వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కావలి నుంచి బైక్‌ ర్యాలీ

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులు వందలాది మంది బైక్‌ ర్యాలీగా చేవూరు రోడ్డు వరకు వెళ్లారు. అక్కడ కందుకూరు ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ ఆధ్వర్యంలో తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి చేవూరు మీదుగా పోర్టు రోడ్డులో బయల్దేరారు. అయితే అక్కడ పోలీసుల అడుగడుగునా అడ్డుకున్నారు.

ఉద్రిక్తంగా మారిన

హైవే దిగ్బంధం

పోలీసుల తీరును నిరసిస్తూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోల్‌కత్తా–చైన్నె జాతీయ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. మరోసారి రంగ ప్రవేశం చేసిన పోలీసులు నాయకులను బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై పడుకున్న కాకాణిని పోలీసులు బలవంతంగా పక్కకి ఈడ్చి పడేశారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి, బుర్రాను లాక్కెళ్లే ప్రయత్నంలో పెద్ద ఎత్తున తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొంది. రోడ్డుపై బైఠాయించిన మహిళా నేతలను మహిళా పోలీసులు పక్కకి లాగేశారు.

అంతం కాదు..

ఆరంభం మాత్రమే

‘రామాయపట్నం పోర్టు ప్రజల ఆస్తి.. దాన్ని ప్రైవేటీకరించేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటాం. ఇది అంతం కాదు.. ప్రజల హక్కుల కోసం ప్రారంభమైన పోరాటానికి ఇదే ఆరంభం’ అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోర్టును పరిశీలించేందుకు, ప్రజలకు నిజాలు చెప్పేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం, పోలీసులతో బలవంతంగా తరలించడం ప్రభుత్వ భయానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తిని అమ్మే కుట్ర బయ ట పడుతుందనే భయంతోనే మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజల ఆస్తులను కాపాడే ఈ పోరాటం ఇక్కడితో ముగిసేది కాదు. రామాయపట్నం పోర్టు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగే వరకు, ప్రైవేటీకరణ నిర్ణయం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు న్యాయ పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.

సూపర్‌ సక్సెస్‌

రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో రామాయపట్నం‘ కార్యక్రమం విజయవంతమైంది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కందుకూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు లు, మత్స్యకారులు భారీ సంఖ్యలో కార్లు, బైక్‌లతో ర్యాలీగా రామాయపట్నం పోర్టు వైపు తరలివెళ్లి ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

నేతలపై కేసులు

జాతీయ రహదారిపై రాస్తారోకో చేసినందుకు వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితోపాటు కందుకూరు నాయకులు గణేశం గంగిరెడ్డి, షేక్‌ రఫి, బిళ్లా రమణయ్య, కాపులూరి మధుసూదన్‌యాదవ్‌, చేపల బాలాజీ, కాట్రగడ్డ వెంకట్రావు, కావలి నియోజకవర్గానికి చెందిన కామరాజు తదితరులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement