ఆత్మకూరు: తెల్లవారుజామున టీ తాగేందుకు మున్సిపల్ బస్టాండ్ వద్దకు వెళ్తున్న ఓ వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఎస్సై జంపాని కుమార్, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని నాగేంద్రపురానికి చెందిన చలమల సుబ్బారెడ్డి (78) టీ తాగేందుకు మున్సిపల్ బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమశిలకు వెళ్తూ సుబ్బారెడ్డిని గమనించకుండా అతివేగంగా వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును రివర్స్ చేశాడు. కాసేపటికి సోమశిలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీ ఫుటేజీలో కెమెరాల్లో రికార్డైంది. స్థానికులు గమనించి పరిశీలించగా అప్పటికే సుబ్బారెడ్డి మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సోమశిల మార్గంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ సయ్యద్ కరిముల్లాను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మృతుడి బంధువుల నిరసన
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినా అధికారులు స్పందించలేదంటూ మృతుడి బంధువులు ఘటనా స్థలంలో మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సై జంపాని కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్ట్ చేశామని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు నిరసన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రెండు బైక్‌లు ఢీకొని..
కావలి: పట్టణంలోని ట్రంకురోడ్డు ఉత్తర శివార్లలో శుక్రవారం ఉదయం రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వెంకగళరావునగర్‌కు చెందిన దేవమణినాయుడు (60) తన బైక్‌లో ఉత్తర శివార్లలోని బంకులో పెట్రోల్ పట్టించుకుని తిరిగి వస్తుండగా, ఎదురుగా మద్దూరుపాడు వైపు పట్టణానికి చెందిన యోగేంద్ర, ధనూష్ అనే యువకులు బైక్‌పై అతివేగంగా వెళ్తూ ఢీకొన్నారు. ఈ ఘటనలో దేవమణినాయుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బీరుపొట్టు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
కొడవలూరు: గుర్తు తెలి యని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన మండలంలోని తలమంచి సెంటర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దామేగుంట చలివేంద్రం కాలనీకి చెందిన అద్దూరి తులసమ్మ (68) తలమంచి సెంటర్‌లో శుక్రవారం రోడ్డు దాటుతుండగా అల్లూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన తులసమ్మను 108 వాహనంలో అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లుగా సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఇక్కడి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అదే సమయంలో బైక్ వెళ్లినట్లు గుర్తించారు. ఆ వాహనం ఢీకొనడంతో వృద్ధురాలు మృతిచెంది ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
గూడూరు వైపు వెళ్తూ..
కోట: మండలంలోని కొండుగుంట వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ ముజీబ్ (30) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చిట్టేడుకు చెందిన అమీర్‌బాషా కుమారుడు ముజీబ్ మోటార్‌బైక్‌పై గూడూరు వైపు వెళ్తూ కొండుగుంట వద్ద రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గర్భంతో ఉన్న తన భార్యను చూసేందుకు ముజీబ్ శ్రీకాళహస్తికి వెళ్తున్నట్లు తెలిపారు. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీకొన్నట్లు సమాచారం.విచారణ జరుపుతున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.
● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి


