● పొలం వివాదంలో మహిళలపై దాడి
● ముగ్గురికి తీవ్ర గాయాలు
● బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు
చేజర్ల: టీడీపీ నేతలు రోజురోజుకూ బరితెగిస్తున్నారు. పొలం వివాదంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన ముగ్గురు మహిళలపై దాడి చేసి గాయపరిచారు. అయితే దాడిని కప్పిపుచ్చుకునేందుకు నాయకులు అధికార బలాన్ని ఉపయోగించి బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికిత్స పొందుతున్న మహిళల వద్ద పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించలేదు. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని కోటితీర్థంలో టీడీపీ నేత కొమ్మి జనార్ధన్ నాయుడికి అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలు మేకా సరోజనమ్మకు భూమి హద్దు వివాదం ఉంది. బుధవారం అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించి జనార్ధన్‌కు సరోజనమ్మకు చెందిన భూమిలో హద్దులు చూపించింది. శుక్రవారం ఉదయం సదరు నేత వర్గం ఆ పొలంలో ఫినిషింగ్ రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సమీప పొలంలో కాపలాగా ఉన్న మేకా సరోజనమ్మ, మేకా రత్నమ్మ, నాగినేని దొరసానమ్మను దూషించారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై జనార్దన్, అతని మామ పొత్తూరు రామయ్య, బావమరిది పొత్తూరు శ్రీహరి మరికొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుల బంధువులు 112 హెల్ప్‌లైన్, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
● సాయంత్రం తీరిగ్గా గ్రామానికి చేరుకున్న చేజర్ల పోలీసులు టీడీపీ నేతలు గాయపడిన మహిళలపై ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నారు. ఇదిలా ఉండగా హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి మాపై దాడి జరిగిందని బాధితులు తెలిపినప్పటికీ పోలీసులు వారి నుంచి ప్రాథమిక సమాచారాన్ని కూడా సేకరించలేదు. ముగ్గురు మహిళలను మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


