● డీఆర్వో విజయకుమార్
నెల్లూరు(అర్బన్): చదువుకోవాలనే ఆసక్తి ఉన్న గృహిణిలు, ఉద్యోగులు, వివిధ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఏపీఓఎస్‌ఎస్) నిర్వహిస్తున్న దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేయొచ్చని జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో డీఈఓ బాలాజీరావు, జెడ్పీ సీఈఓ వసుమతి ఇతర అధికారులతో కలిసి డీఆర్వో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూరవిద్య ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు సైతం తెచ్చుకున్నారన్నారు. తాము పనిచేసే రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చన్నారు. చదువును కొనసాగించలేకపోయిన వారికి దూరవిద్య సువర్ణ అవకాశం కల్పిస్తుందన్నారు. డీఈఓ మాట్లాడుతూ 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు రూ.200 ఫైన్‌తో ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.


