పోర్టుకు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

పోర్టుకు వెన్నుపోటు

Jul 18 2026 9:27 AM | Updated on Jul 18 2026 9:27 AM

నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు

తలమానికం రామాయపట్నం పోర్టు

రూ.4929.39 కోట్లతో

4 బెర్త్‌లతో తొలి దశ పోర్టు

పనులు 95 శాతం పూర్తి

రెండేళ్లుగా జాతికి అంకితం

చేయకుండా నిర్లక్ష్యం

ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు

చంద్రబాబు సర్కారు

కుటిల యత్నాలు

నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చలో రామాయపట్నం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మణిహారంగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ద్రోహదపడే రామాయపట్నం పోర్టుకు చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైంది. కోస్తా తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.4902.39 కోట్ల పెట్టుబడి అంచనాతో 850.79 ఎకరాల్లో తొలి దశగా 2022 జూలై 20న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్‌ మెట్రిక్‌ టన్స్‌ పర్‌ యానమ్‌) సామర్థ్యంతో రెండు జనరల్‌, ఒకటి కోల్‌, ఒకటి మల్టీపర్పస్‌ వినియోగంగా నాలుగు బెర్తులతో నిర్మాణాన్ని 2023 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు 95 శాతానికి పైగా పోర్టు పనులు పూర్తయ్యాయి. రెండో దశకు 15 బెర్తులు పూర్తి చేసి 138.54 మిలియన్‌ మెట్రిక్‌ టన్స్‌ పర్‌ యానమ్‌ రవాణా లక్ష్యంగా గత ప్రభుత్వం ప్రణాళికను రచించింది. అప్పటికే బ్రేక్‌ ఫీడర్ల నిర్మాణంతోపాటు లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన భారీ నౌకలు నిలిచే విధంగా 16 మీటర్ల వరకు డ్రెడ్జింగ్‌ పూర్తి చేశారు. ఒక బల్క్‌ బెర్తు నిర్మాణం, సెంట్రల్‌ ఎకై ్సజ్‌, కస్టమ్స్‌ విభాగాలకు చెందిన బిల్డింగ్‌ల నిర్మాణాలను సిద్ధం చేసింది.

పోర్టుతో కావలి కనకపట్నం

రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే మొదటగా అభివృద్ధి చెందేది కావలి పట్టణం. పోర్టుకు 15 కి.మీ. దూరంలో రోడ్డు, రైల్‌ కనెక్టివిటి ఉన్న కావలి కనకపట్నంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణాల అభివృద్ధికి పోర్టులే కీలమని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి 50 కి.మీ. ఒక పోర్టు నిర్మించాలని భావించారు. నెల్లూరుకు సమీపంలో కృష్ణపట్నం పోర్టు రూపుదిద్దుకున్న క్రమంలో జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్‌, రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పోర్టులు, హార్బర్లకు అనుబంధంగా ఏర్పడే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పన చేపట్టాలని భావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా, ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాయపట్నంపోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రైవేట్‌ పరం చేసేందుకు చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది.

అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు

2014 ఎన్నికల సమయంలో రామాయపట్నం పోర్టును నిర్మిస్తానని ఆర్భాటంగా హామీలు గుప్పించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా కనీసం సెంటు భూమి సేకరణకు నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికల ముందు ఇదే ప్రచారాస్త్రంతో ఫిబ్రవరిలో డూప్‌ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ప్రభుత్వ కేటాయింపులు కానీ, డీపీఆర్‌ కానీ, భూసేకరణ ప్రణాళిక కానీ, సర్వే కానీ ఏదీ చేయకుండానే హడావుడిగా టెంకాయ కొట్టి వెళ్లారు.

వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రామాయపట్నం పోర్టుకు సంబంధించి విధివిధానాలు, డీపీఆర్‌ సిద్ధం చేసి, బడ్జెట్‌ కేటాయింపులు చేసి, భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చి భూములు సేకరించి, నిర్వాసితులకు పరిహారం అందజేసి 2022 జూలై 20న శంకుస్థాపన చేశారు. కేవలం 18 నెలల్లోనే పోర్టులో కార్యకలాపాలు సాగేలా ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఇటువంటి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రజలకు అంకింత చేయాల్సిన చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పోర్టు పరిధిలో 51 కి.మీ. మేర వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించే విధంగా గత ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తే.. కూటమి సర్కారు దాన్ని 15 కి.మీ.ల పరిధికి కుదించింది.

నేడు చలో రామాయపట్నం

రామాయపట్నం పోర్టును ప్రైవేట్‌పరం చేసేందుకు సర్కారు కుట్రలను నిరసిస్తూ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కందుకూరు సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్‌లు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి శనివారం చలో రామాయపట్నం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement