నెల్లూరు(అర్బన్): సేవకు ప్రతిరూపం రెడ్‌క్రాస్ సంస్థ అని ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా శాఖ స్పెషలాఫీసర్, డీఆర్వో విజయకుమార్ అన్నారు. రెడ్‌క్రాస్‌కు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటీవల నియమించిన అడ్‌హాక్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం గురువారం మద్రాస్ బస్టాండ్ పక్కనే ఉన్న ఆ సంస్థ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రెడ్‌క్రాస్ సేవలు ఎంతో గుర్తింపు తెచ్చాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాలలో రెడ్‌క్రాస్ సేవలు మరువలేనివన్నారు. రెడ్‌క్రాస్ పాలకవర్గం ముగిసినందున ఎన్నికలు జరిగే వరకు నూతన అడ్‌హాక్ కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు.
14 మంది సభ్యుల ప్రమాణం
రెడ్‌క్రాస్ పాలకమండలి నూతన అడ్‌హాక్ కమిటీ సభ్యులుగా 11 మంది, మరో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు కలిపి ప్రమాణం చేశారు. వారిలో స్పెషలాఫీసర్‌గా డీఆర్వో విజయకుమార్, సభ్యులుగా యాలమూరి రంగారావు, సర్వేపల్లి విజయకుమార్, కమలేష్‌కుమార్‌జైన్, జనార్దన్‌రాజు, దయాకర్‌రావు, పాదర్తి నాగరాజు, కలికి శ్రీహరిరెడ్డి, పందిపాటి జనార్దన్‌రెడ్డి, బృంగి సుధాకర్‌రావు, మల్లు స్వాతిరెడ్డి, కుడుముల సుధాకర్‌రెడ్డి, అలాగే జిల్లా కో–ఆపరేటివ్ ఆఫీసర్, జిల్లా ఆడిట్ ఆఫీసర్‌లు ప్రమాణం చేశారు. వీరిలో ఎక్కువ మంది పాత కమిటీలోని సభ్యులే కావడం గమనార్హం. కాగా రిటైర్డ్ డిప్యూటీ ఇంజినీర్ గోసుల వెంకటసుబ్బారెడ్డి రెడ్‌క్రాస్ కేన్సర్ ఆస్పత్రికి రూ.2 లక్షలను విరాళంగా అందజేసి కేన్సర్ రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కోరారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సెక్రటరీ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.


