న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం

Jul 17 2026 12:23 AM | Updated on Jul 17 2026 12:23 AM

పొదలకూరు: అధికార పార్టీకి చెందిన నాయకుడు తన జీవనాధారం కోల్పోయేలా చేశాడని ఓ వృద్ధుడు ఆవేదన చెందుతూ తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పొదలకూరు మండలం మరుపూరు గ్రామానికి చెందిన కొంగి పెంచలనర్సయ్య విలేకరుల సమక్షంలో తన ఆవేదనను వెల్లడించారు. తనకు ఇల్లు లేదని, రేకులు తెచ్చుకుని గ్రామ మెయిన్‌రోడ్డు పక్కన చిన్న నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు తనను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఆర్‌అండ్‌బీ అధికారులను పురాయించారన్నారు. అధికారులు వచ్చి పరిశీలించిన సందర్భంగా తనకు వేరే ఆధారం ఏమీ లేదని, ఉండడానికి నిలువ నీడ కూడా లేదని చెప్పడంతో వారు వెళ్లిపోయినట్టు తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కలిచేటి శ్రీనివాసులురెడ్డి తన మనుషుల చేత బలవంతంగా రేకులను తొలగించడమే కాకుండా తాను నివసించే చోట చెత్తను పోయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇక్కడ టెంకాయలు, జామకాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నానని, శ్రీనివాసులురెడ్డి మనుషులు వచ్చి నా టెంకాయలను పగలగొట్టి వ్యాపారానికి సంబంధించిన కత్తులు, గొడ్డళ్లు తీసుకుపోయారని, నా తోపుడు బండి చక్రాలను విరగ్గొట్టారని తెలిపారు. సామగ్రి మొత్తాన్ని పారేసి నన్ను వీధిన పడేశారని, రోడ్డుపైనే పడుకుంటున్నానని కన్నీంటి పర్యంతం అవుతున్నారు. పిల్లలెవరూ నన్ను పట్టించుకోవడం లేదని, ఇక్కడ కూడా ఉండనివ్వకుండా ఇలా ఇబ్బంది పెడుతుంటే నేను ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement