వెంకటాచలం: సమర్థ నాయకత్వంతోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ అన్నారు. మండలంలోని సరస్వతి నగర్ వద్దనున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో గురువారం విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి డాక్టర్ జల్ది విద్యాధరరావు, సరికొండ నరసింహరాజు సంపాదకత్వంలో 341 మంది కవులు రాసిన ‘యుద్ధం– శాంతి’ కవితల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ యుద్ధం భవిష్యత్ వినాశనానికి కారణమని, ఇది చిన్నారుల జీవితాలను నాశనం చేస్తుందని చెప్పారు. కళారత్న చిన్ని నారాయణరావు, సాహితీ విమర్శకుడు టేకుమళ్ల వెంటప్పయ్య మాట్లాడుతూ యుద్ధం లోకానికి వినాశనాన్ని కలిగిస్తే, శాంతి రేపటి తరానికి వెలుగునిస్తుందని అన్నారు. ప్రముఖ రచయిత్రి గోవిందరాజు సుభద్రాదేవి మాట్లాడుతూ సమాజానికి హితాన్ని కలిగించేదే సాహిత్యమని, మనిషి అత్యున్నతంగా ఎదగాలంటే నిరంతరం సమస్యలతో యుద్ధం చేయాలన్నారు. ప్రముఖ రచయిత అవ్వారు శ్రీధర్‌బాబు, రచయిత్రి పార్లపల్లి నాగేశ్వరమ్మ, ఆదినారాయణరెడ్డి, దయాకర్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.


