డీఈఓ సస్పెన్షన్‌కు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

డీఈఓ సస్పెన్షన్‌కు డిమాండ్‌

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

నెల్లూరు (టౌన్‌): కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్‌ పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నా పట్టించుకోని డీఈఓను సస్పెండ్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మస్తాన్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్‌ తదితర పేర్లతో విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో రూ.2 వేలు విలువ కూడా చేయని పుస్తకాలను రూ.10 వేలకు అమ్ముతున్నారన్నారు. ఈ రీతిలో వసూళ్లు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో నోటీసు బోర్డుల్లో ఫీజుల పట్టికను ప్రదర్శనలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు షారూఖ్‌, శివంవర్మ, అశీర్‌, యస్దానీ, సోహెల్‌, ఖాదర్‌బాషా, జీవన్‌, కోటి, మున్నా, హర్ష, యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి

నెల్లూరు(పొగతోట): సమాజంలో ఎదురవుతున్న సమస్యలను మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఐసీడీఎస్‌ పీడీ హేనా సుజన్‌ అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని మహిళలతో నిర్వహించిన నో సూసైడ్‌ మానస్‌ వికాస్‌ కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. మహిళలు మానసిక ఆరోగ్య పరిరక్షణ, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలన్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలపై మహిళలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. సఖీ సెంటర్‌ అడ్మిన్‌ షహనాజ్‌ మాట్లాడుతూ మహిళల మానసిక ఆరోగ్య సహాయానికి 14416, సహాయర్థం 181, పిల్లల రక్షణ కోసం 1098, అత్యవసర సేవల కోసం 112 హెల్ప్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

పీడియాట్రిక్‌ ఒబేసిటీ సేవలు ప్రారంభం

నెల్లూరు(అర్బన్‌): పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం(ఒబేసిటీ) సమస్యను తగ్గించేందుకు నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో పీడియాట్రిక్‌ ఒబేసిటీ సేవలను ప్రారంభించామని ఆస్పత్రి అడిషనల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీష్‌ రావులపల్లి, పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి సునంద తెలిపారు. ఇందుకు సంబందించిన వాల్‌పోస్టర్లను శనివారం ఆస్పత్రిలో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జంక్‌ఫుడ్‌, స్క్రీన్‌కు ఎక్కువగా అతుక్కుపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరిగిపోతుందన్నారు. ఫలితంగా భవిష్యత్తులో బీపీ, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత, గుండె సంబంధిత సమస్యలు వస్తాయన్నారు. ఇక్కడి ఒబేసిటీ కేర్‌లో ప్రాథమిక పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. ప్రత్యేకమైన పరీక్షలపై 50 శాతం రాయితీ కల్పించామన్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలో డైటీషియన్‌ సలహాలు ఇస్తారన్నారు. హార్మోన్ల సమస్య ఉంటే ఉచితంగా ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించవచ్చన్నారు. జూలై 26వ తేదీ వరకు ఉచితంగా సేవలందిస్తామన్నారు. కార్యక్రమంలో చిన్నపిల్ల వైద్యులు డాక్టర్‌ హారిక, చీఫ్‌ డైటీషియన్‌ పద్మజామదన్‌, సాంబశివరావు, ఆస్పత్రి ఏజీఎం ఏసీ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement