సాయికృష్ణ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి | - | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

పౌర హక్కుల సంఘం డిమాండ్‌

నెల్లూరురూరల్‌: సాయికృష్ణ కస్టడీ మరణం, అనంతరం ఆయన మృతదేహాన్ని మాయం చేసిన ఘటనపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.బ్రహ్మం, కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం కేవలం కృష్ణలంక సీఐ నాగరాజుపై మాత్రమే హత్యా కేసు నమోదు చేయడం కేసును నీరుగార్చే ప్రయత్నంలో భాగమన్నారు. ఈ ఘటనపై 20 రోజులుగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నప్పటికీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారుల పాత్రపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ కేసులో సంబంధిత పోలీసు అధికారులను ముద్దాయిలుగా చేర్చి విచారణ జరపాలని కోరారు. ఇందులో ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్పీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించడం సరైన చర్య కాదన్నారు. మృతుడు సాయికృష్ణ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం అందించాలని కోరారు. అలాగే గతంలో క్రాంతికుమార్‌ అనే దళిత యువకుడు తనకు జరిగిన వేధింపుల గురించి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన ఘటనపైనా సీఐ నాగరాజు, ఇతర సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

న్యాయవాదులకు శిక్షణ

నెల్లూరు (లీగల్‌): న్యాయవాదుల జాతీయ రిజిస్టర్‌ (ఈ ఫైలింగ్‌ వెర్షన్‌ 3.0)పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం శనివారం జిల్లా కోర్టు హాలులో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి న్యాయవాది రిజిస్టర్‌ చేసుకుని కేసులు ఆన్‌లైన్‌ ద్వారా ఫైల్‌ చేయాలని, అందుకోసం రిజిస్ట్రేషన్‌ అయిన ప్రతి న్యాయవాదికి యూనిక్‌ నేషనల్‌ అడ్వొకేట్‌ ఐడీ గుర్తింపు పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వైజే పద్మశ్రీ, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.

స్టేట్‌ స్టూడెంట్‌ వింగ్‌ సెక్రటరీగా నేలటూరి

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌సీపీ స్టేట్‌ స్టూడెంట్‌ వింగ్‌ సెక్రటరీగా ఆత్మకూరుకు చెందిన నేలటూరి మల్లికార్జున్‌రెడ్డిని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement