కరెంట్‌ రాలేదని సబ్‌స్టేషన్‌ వద్దే నిద్ర | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ రాలేదని సబ్‌స్టేషన్‌ వద్దే నిద్ర

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలో కొద్ది రోజులుగా ఇష్టానుసారంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుండడం, దీనికితోడు చిన్నపాటి గాలివాన వచ్చినా విద్యుత్‌ వైర్లు దెబ్బతిని గంటల తరబడి సరఫరా లేకపోతుండడంతో పట్టణవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 20వ వార్డు ఏకలవ్యనగర్‌లో శుక్రవారం రాత్రి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి ఎదురుచూసినా సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో కాలనీవాసులు సమీపంలో ఉన్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద నేలపై పడుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అనంతరం శనివారం ఉదయం విద్యుత్‌ శాఖ కార్యాలయం వద్దకు సీపీఎం నాయకులతో కలిసి వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ కాలనీలో విద్యుత్‌ సమస్య గురించి ఎన్నిమార్లు అదికారులకు తెలిపినా పరిష్కారం కాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం విద్యుత్‌ శాఖ డివిజనల్‌ ఈఈ భానునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ పట్టణంలో పాత విద్యుత్‌ కండెక్టర్లు మార్పిడి చేయనున్నామని, చిన్న ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement