● నిందితుల అరెస్ట్
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో చిట్టీల పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన చల్లా చెంగమ్మ, ఆమె భర్త ఏడుకొండలు, మరో వ్యక్తి రవికుమార్ కలిసి పలువురు పేద ప్రజలను నమ్మించి చిట్టీల పేరుతో సుమారు రూ.2 కోట్లకు పైగా వసూలు చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. రోజువారీ కూలి పనులు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేదలను లక్ష్యంగా చేసుకుని పిల్లల చదువులు, వివాహాల కోసం దాచుకున్న డబ్బులను నిందితులు చిట్టీల్లో పెట్టుబడిగా పెట్టించారు. అయితే చిట్టీల సమయం పూర్తయిన తర్వాత నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో బాధితులు కొందరు స్పందించారు. దీంతో మిగిలిన బాధితులంతా కలిసి పెద్ద సంఖ్యలో కృష్ణపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. యాతలూరు అరుణ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక్కసారిగా పోవడంతో అనేక కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఒక్కో రూపాయి కూడబెట్టి దాచుకున్న డబ్బు తిరిగి రాదనే ఆందోళనలో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు పోర్టు సీఐ రఘుబాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాసరెడ్డి నిందితులను రిలయన్స్ రోడ్డు వద్ద అరెస్ట్ చేశారు.


