సీబీఐ విచారణ జరపాల్సిందే | - | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణ జరపాల్సిందే

Jun 2 2026 12:32 AM | Updated on Jun 2 2026 12:32 AM

విద్యాశాఖ మంత్రిగా లోకేశ్‌ అనర్హుడు

ఉపాధ్యాయులు కావాలనే తమ కలలను మెగా డీఎస్సీ పేరుతో పోస్టులను అమ్ముకుని కల్లలు చేశారంటూ దగా పడిన అభ్యర్థులు దండయాత్ర ప్రారంభించారు. అర్హత సాధించి, మెరిట్‌ జాబితాలో ఉండి ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్‌ అనర్హుడని, బాధ్యత వహించి రాజీనామా చేయాలని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. అసమర్థ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించకుండానే, కాల్‌ లెటర్లు లేకుండానే ఇష్టారీతిన ఎంపికలు చేశారని, స్పోర్ట్స్‌ కోటా పేరుతో పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. డీఎస్సీ పరీక్షల నుంచి పోస్టింగ్‌ల ప్రక్రియ వరకు జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబట్టారు.
ఆధ్యంతం అక్రమాల పుట్ట

నెల్లూరు రూరల్‌: మెగా డీఎస్సీ నిర్వహణలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరుద్యోగులు, అర్హత సాధించి, మెరిట్‌ జాబితాలో ఉండి ఉద్యోగాలు దక్కని డీఎస్సీ అభ్యర్థులు సోమవారం నెల్లూరులో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి నేతృత్వంలో తొలుత వీఆర్‌సీ సెంటర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులు, యువత, నిరుద్యోగులతో కలిసి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. యువత, డీఎస్సీ అభ్యర్థులను అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఇది ప్రజాస్వామికమని మండిపడ్డారు. కేసులు పెట్టినా, అరెస్ట్‌ చేసినా ౖవైఎస్సార్‌సీపీ నాయకులు భయపడబోరని హెచ్చరించారు. ‘అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి మొదటి ర్యాంక్‌ ఎలా వచ్చింది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, రూ.15 లక్షలకు స్పోర్ట్స్‌ కోటాలో పోస్టుల అమ్మకాలు, డీఎస్సీలో పారదర్శకతకు పాతర, డేటా ఎందుకు డిలిట్‌ చేశారు.. మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు దాచారు, చంద్రబాబు సుపుత్రుడు శాఖ డార్క్‌ ఆపరేషన్‌’ అనే నినాదాల ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ కలెక్టరేట్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్‌, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకుడు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, రాష్ట్ర జోనల్‌ మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, సిటీ మహిళా అధ్యక్షురాలు ధనుజారెడ్డి పలువురు కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగులు, యువజన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తక్షణమే రాజీనామా చేయాలి

ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియపై సీబీఐ విచారణ చేసే వరకు పోరాటం ఆగదు

మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు

మెరిట్‌ లిస్ట్‌ లేకుండానే ఎంపికలు, స్పోర్ట్స్‌ కోటా పేరుతో అమ్ముకున్నారు

Advertisement
 
Advertisement
Advertisement