● రెండో ప్లాంట్ వద్ద కూడా నిరసన
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని నేలటూరు ఎస్‌ఈఐఎల్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం రెండు వారాలుగా ఆందోళన బాట పట్టారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమ సదుపాయాల కల్పన తదితర డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో పవర్ ప్లాంట్ వద్ద కూడా సోమవారం చేపట్టారు. విద్యుత్ కేంద్రం ప్రధాన గేటు వద్ద కార్మికులు భారీ సంఖ్యలో చేరుకుని ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేకపోవడంతో రెండో ప్లాంట్ వద్ద కూడా ఆందోళనకు దిగాల్సి వచ్చిందని కార్మికులు తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలని సీఐటీయూ నాయకులు కోరారు. సమస్యలను పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అవసరమైతే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా కారణంగా విద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
డీ–కోడింగ్ సెంటర్ నుంచి
శాంపిల్స్ నిలిపివేత
● ఏడీఏ శివనాయక్
పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గం అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌కు అమరావతి రీజనల్ కోడింగ్ సెంటర్ల నుంచి నాన్ పైలట్ ల్యాబ్ కింద శాంపిల్స్‌ను నిలిపివేశారని పొదలకూరు ఏడీఏ కే శివనాయక్ వెల్లడించారు. సోమవారం ఏడీఏ మాట్లాడుతూ ఇక్కడ రైతులు అందజేసిన విత్తనాలు, ఎరువుల శాంపిళ్లపై పరీక్షలను నిర్వహించామన్నారు. 2025–26 సంవత్సరంలో 104 విత్తనాలు, ఎరువులు 52 శాంపిళ్లకు పరీక్షలను నిర్వహించి రైతులకు నివేదికలు అందజేశామన్నారు. పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో ఉన్న అగ్రి ల్యాబ్‌ను వ్యవసాయశాఖకు అప్పగించారని, భవనంలో ఉన్న లాబ్ పరికరాలను ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని గతంలో వారు నిర్వహిస్తున్న విధులకు తిరిగి బదిలీ చేయడం జరగిందన్నారు. భవనాన్ని వ్యవసాయశాఖ స్వాధీనం చేసుకుని కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,826 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 42,747 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
విద్యుత్ క్రీడాకారుల
ఎంపిక నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ ట్రాన్స్‌కో ఉత్తర్వుల మేరకు ఇంటర్ సర్కిల్ వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు ఏపీఈపీడీపీఎల్ ఆధ్వర్యంలో విజయనగరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సర్కిల్ స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామి వేలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా సర్కిల్ పరిధిలోని రెగ్యులర్, జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ – 2 ఉద్యోగులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విద్యుత్ భవన్‌లో నిర్వహించే ఎంపికలకు హాజరుకావాలని సూచిచారు. వివరాలకు 90308 02038, 85550 26614 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
ఓపెన్ స్కూల్
ప్రాక్టికల్స్ వాయిదా
నెల్లూరు(టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఈనెల 2వ తేదీన నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షను 7వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ప్రాక్టికల్స్ ఈనెల 3 నుంచి 6వ తేదీ వరకు యథావిధిగా జరుగుతాయని తెలియజేశారు.


