నెల్లూరు(వేదాయపాళెం): ‘ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశముంది. భూసారం, నేలలో తేమను సంరక్షించుకునేందుకు అనువైన పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలి’ అని రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె. కన్నయ్య సూచించారు. నెల్లూరులోని కార్యాలయంలో సోమవారం ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో ముందుగానే విత్తన గుళికలను సిద్ధం చేసుకుని విత్తడం వల్ల వర్షాలు ప్రారంభమైన వెంటనే పంటలు స్థిరపడే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. తక్కువ నీటితో సాగయ్యే పశుగ్రాస పంటలను ప్రోత్సహించాలన్నారు. గ్రామ స్థాయిలో పర్యటిస్తూ రైతులకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను తెలుసుకుని తగిన సూచనలు అందించాలని ఆదేశించారు. ఇంకా ప్రాంతీయ సాంకేతిక సమన్వయకర్త రవిచంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.


