నీకు సగం.. నాకు సగం | - | Sakshi
Sakshi News home page

నీకు సగం.. నాకు సగం

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

గూడూరు మున్సిపల్‌ కమిషనర్‌ అంతా నా ఇష్టం.. నేను చెప్పిందే వేదం.. నాకు జీఓలు,

రూల్స్‌ వర్తించవు అనేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని కూరగాయాల

మార్కెట్‌లో దుకాణాల కోసం చాలామంది పోటీ పడుతుంటారు. కానీ వాటి కేటాయింపులో

నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: గూడూరు మున్సిపాలిటీలో కూరగాయల మార్కెట్‌ దుకాణాల కేటాయింపు తీవ్ర వివాదాస్పదంగా మారింది. బహిరంగ వేలం నిర్వహించకుండా కేటాయించడంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీకు సగం.. నాకు సగం అనే విధానంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల గమ్మళ్లపాళెం వద్ద ఏర్పాటు చేసిన హైమాక్స్‌ విద్యుత్‌ దీపాల ప్రారంభో త్సవంలో స్థానిక ఎమ్మెల్యే సునీల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లును ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో కూరగాయల మార్కెట్‌ దుకాణాల కేటాయింపుల్లో అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో, మున్సిపాలిటీలో ప్రభావం కలిగిన మాజీ నాయకుడి సహకారంతో కమిషనర్‌ను కీలుబొమ్మలా మార్చుకుని కేటాయింపులు చేపట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా..

పట్టణ నడిబొడ్డున నిర్మించిన కూరగాయల మార్కెట్‌లో మొత్తం 40 దుకాణాలున్నాయి. వీటిని కేటాయించాలంటే బహిరంగ వేలం లేదా టెండర్‌ ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా, అలాంటి చేయకుండానే పాత దుకాణదారులకే లీజుకిచ్చినట్లు సమాచారం. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా దుకాణాలను బహిరంగ వేలం ద్వారానే కేటాయించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టినట్లు ఆరోపణలున్నాయి. దుకాణాల కేటాయింపుల్లో తమ చేతివాటం ప్రదర్శించి వాటాలు పంచుకున్నట్లు తెలుస్తుంది.

రూ.లక్షల్లో వ్యాపారం

కూరగాయల మార్కెట్‌లో నిత్యం వ్యాపారం రూ.లక్షల్లో జరుగుతుంది. పట్టణ జనాభా కనీసం లక్షకు పైగా ఉండగా పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కాగా అందులో పనిచేసే కార్మికులు అదనంగా మరో 50 వేల వరకు ఉంటారు. వీరంతా నిత్యం వారికి సమీపంలో ఉండే చిన్నపాటి దుకాణాల వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. అలాంటి చిరు వ్యాపారులు మార్కెట్‌కు వచ్చి ఇక్కడ పెద్ద దుకాణాల్లో కూరగాయలు తీసుకుని వెళుతుంటారు. అలాగే గూడూరు ప్రాంతం నుంచి సైదాపురం, బాలాయపల్లి, కోట, ఓజిలి, చిల్లకూరు మండలాల్లోని పలువురు చిరు వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేస్తారు. అందువల్లే దుకాణాలకు అంతగా పోటీ ఉంటుంది.

అంతా నా ఇష్టం

మున్సిపాలిటీలో పాలకవర్గం లేకపోవడం, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ బలహీనంగా ఉండటంతో కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేస్తాను.. ప్రజాప్రతినిధి అండ ఉందంటూ నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మార్కెట్‌ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ప్రోటోకాల్‌ వివాదం కూడా చర్చనీయాంశమైంది.

వారికి అవకాశం లేదా?

దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీలు, మహిళలు, దివ్యాంగులతోపాటు చిరు వ్యాపారులకు కనీసం చోటు కల్పించకపోవడంతో వారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని మదన పడుతున్నారు. పెట్టుబడులు పెట్టుకునే స్థోమత తమ వద్ద ఉంటే ప్రైవేట్‌ దుకాణాలను అద్దె తీసుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్లం కదా అని ప్రశ్నిస్తున్నారు. మహిళా సాధికారత, బలహీన వర్గాల అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకునే నేతలు ఇక్కడ మాత్రం నిబంధనలను విస్మరించారని విమర్శలు వినిపిస్తున్నాయి.

దుకాణాల కేటాయింపులో

కమిషనర్‌ స్వామి భక్తి

వేలం లేకుండానే కేటాయింపులపై ఆరోపణలు

మున్సిపాలిటీ ఖజానాకు గండి

మున్సిపల్‌ ఆదాయానికి గండి

దుకాణాలను బహిరంగ వేలం వేస్తే మున్సిపాలిటీకి గణనీయమైన ఆదాయం వచ్చేదని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే వేలం లేకుండా కేటాయింపులు జరగడంతో మున్సిపల్‌ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ ఆదాయం గురించి తరచూ మాట్లాడే కొందరు మాజీ నాయకులు కూడా ఈ వ్యవహారంపై మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కేటాయింపులు చేస్తాం

పాత మార్కెట్‌లో దుకాణాలను లీజుకు తీసుకున్న వ్యాపారులను ఖాళీ చేయించే సమయంలో కొత్త దుకాణాల్లో అవకాశమిస్తామని మాట ఇవ్వడం జరిగింది. దీంతోనే ప్రస్తుతం వారికే ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు మార్కెట్‌లో మొదటి అంతస్తులో ఉండే దుకాణాల్లో అవకాశం కల్పిస్తాం.

– వెంకటేశ్వర్లు, గూడూరు మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
 
Advertisement
Advertisement