● రూ.లక్ష నష్టం
అనుమసముద్రంపేట: మండలంలోని అనుమసముద్రం గ్రామ పొలిమేరల్లో జామాయిల్ తోట దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు ఎండీ యూసఫ్ సుమారు ఐదెకరాల్లో జామాయిల్ తోట సాగుచేస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం తోట దగ్ధమవడాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని వెంటనే ఆత్మకూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపడంతో ఫైర్ అధికారి బాలాజీ గురుప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏఎస్‌పేటకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సగభాగం పైగా అగ్నికి ఆహుతైంది. దీంతో రూ.లక్ష పైగా నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆకతాయిల చేష్టలతో ఇలా జరిగి ఉంటుందేమోనని బాధిత రైతు అనుమానం వ్యక్తం చేశాడు.
గూడ్స్ రైలు ఢీకొని
వ్యక్తి మృతి
కోవూరు: పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బిట్రగుంట నుంచి రేణిగుంట వైపు రైలు వెళ్తోంది. ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్న సమయంలో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని వయసు 45 నుంచి 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు.
గోవుల అక్రమ
రవాణా అడ్డగింత
నెల్లూరు(అర్బన్): రూరల్ మండల పరిధిలోని చింతారెడ్డిపాళెంలో గుర్తుతెలియని వ్యక్తులు గోవులను కసాయి వ్యక్తులకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే ఆ ప్రాంతంలో కొన్ని గోవులను వధించి మాంసం విక్రయించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు శుక్రవారం అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్రమార్కులు పరారయ్యారు. 9 గోవులను రక్షించి గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా సీఐ వేణు మాట్లాడుతూ దీని వెనుక ఎవరున్నారో విచారణ చేస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.
హోటళ్లలో
అధికారుల తనిఖీలు
● 19 సిలిండర్ల స్వాధీనం
నెల్లూరు(పొగతోట): సివిల్ సప్లయీస్ అధికారులు నెల్లూరు మినీబైపాస్ రోడ్డులోని రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 8 కేసులు నమోదు చేసి 19 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీ నం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ పుల్లయ్య మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ లక్ష్మీనారాయణరెడ్డి, సీఎస్ డీటీలు అజీజ్, రవి, రామకృష్ణ పాల్గొన్నారు.
కండలేరులో
39.220 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 39.220 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


