● కూటమి ప్రభుత్వంలో రోగులకు కష్టాలెన్నో..
● వీల్ చైర్ దొరకదు
● స్ట్రెచర్ కానరాదు
● అందుబాటులో
ఉండని సీనియర్ డాక్టర్లు
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని పెద్దాస్పత్రి.. ఇక్కడ నెలకొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. సీనియర్ డాక్టర్లు, వైద్య పరీక్షలున్నా రోగులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. వైద్యం దైవా దీనంగా మారింది. పలువురు వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎంఆర్‌ఐ, సీటీ లాంటి ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేశారు. నూతన భవనాలు నిర్మించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ చేశారు. అయితే నేటి కూటమి ప్రభుత్వంలో సేవలు అధ్వానంగా మారాయి.
ఇలా ఎన్నో..
ఆస్పత్రిలో డాక్టర్లు సమయపాలన ఎందుకు పాటించడం లేదు. సీనియర్లు గంటో, రెండు గంటలు మాత్రమే ఉంటున్నారు. భారమంతా జూనియర్ వైద్యులపై పడుతోంది. వీల్ చైర్, స్ట్రెచర్లు అందుబాటులో ఉండవు. యాక్సిడెంట్ కేసులు వచ్చినా గంటల కొద్దీ వాటి కోసం రోగుల బంధువులే ఎందుకు వెతకాల్సి వస్తోంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయాలంటే రెండు నుంచి నాలుగు రోజులు ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఈ లోపు రోగికి ఏమైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంఆర్‌ఐ, సీటీ స్కానింగ్ రిపోర్టులు కావాలంటే మూడు, నాలు గు రోజులు ఆగాల్సిందే. రక్తపరీక్షలు కావాలంటే మిద్దైపెకి ఎక్కాలి. అయితే లిఫ్ట్ కొన్నినెలలుగా పని చేయడం లేదు. వార్డుల్లోని లిఫ్ట్‌లు కూడా సక్రమంగా పని చేయవు. న్యూరో, యూరాలజీ తదితర సర్జరీలు చేసేందుకు కనీస పరికరాల్లేవు. ఇదే సాకుగా డాక్టర్లు థంబ్ వేసి వెళ్లిపోతున్నారు. ఆపరేషన్లు చేయాలంటే ఏసీలు చాలా కాలంగా పని చేయడం లేదు. మరుగుదొడ్లు కంపు కొడుతుంటాయి. బకెట్లు, మగ్గులు సరిపడా లేవు. ఎమర్జెన్సీలో అవసరమైన పరికరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ట్రామా కేర్ సిబ్బందికి నెలలుగా జీతాలు రాలేదు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు కావాలంటే నెలల తరబడి తిప్పుకొంటున్నారు. సూపరింటెండెంట్ రెగ్యులర్‌గా రౌండ్స్ వేయడం లేదనే ఆరోపణలున్నాయి. డాక్టర్లు లేకపోతే అడగడం లేదని తెలిసింది. దీంతో పలువురు ఆలస్యంగా వస్తున్నారు. ఓపీ చీటీలు ఉదయం 8 గంటలకు రాయడం ప్రారంభించాలి. కానీ 8:30 గంటలకు కూడా మొదలు పెట్టడం లేదు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల కోసం ఉద్యోగులతోపాటు విశ్రాంత ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరైన రూ.22 కోట్లతో గత ఆగస్టు నాటికే పూర్తయిన సీసీయూ భవన సముదాయాన్ని ఇంకా ప్రారంభించలేదు.


