సమస్యల పరిష్కారమే పల్లె వీక్షణ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే పల్లె వీక్షణ లక్ష్యం

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా వెల్లడి

సైదాపురం: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. మండలంలోని కొమ్మిపాడు గ్రామంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వారంలో ఒకరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా పరిశీలించి వెంటనే పరిష్కరించే లక్ష్యంతో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రం వద్ద సీసీ రోడ్డు నిర్మాణం, ఓహెచ్‌ఆర్‌ ట్యాంక్‌ నుంచి పైపులైన్‌ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారన్నారు. పైపులైన్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడం సంతోషకరమని, అలాగే సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామంలో ఉన్న విద్యుత్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 80 అర్జీలు అందగా, వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించామని చెప్పారు. మిగిలిన వాటికి 30 రోజుల్లో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement