నెల్లూరు(పొగతోట): ప్రస్తుత టీడీపీ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీలో అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద పార్టీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నేతలను ఖాకీలు అరెస్ట్ చేసి చిన్నబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కాకాణి హుటాహుటిన చేరుకున్నారు. దీంతో విద్యార్థి విభాగ నేతలను పోలీసులు వదిలేసి, త్వరగా వెళ్లిపోవాలని సూచించారు.
మెగా కాదు.. దగా డీఎస్సీ
మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా టీడీపీ ప్రభుత్వం మార్చేసిందని కాకాణి ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ అన్ని రంగాల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను ఘోరంగా వంచించారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీని తీసుకొస్తామంటూ ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి ఆయన ప్రగల్భాలు పలికారని, అయితే లక్షలాది మందిని మోసం చేశారని ధ్వజమెత్తారు.
అనేక అనుమానాలు
2025లో విడుదల చేసిన డీఎస్సీకి సంబంధించిన నియామకాల్లో అనేక అనుమానాలు, అపోహలు నిరుద్యోగుల్లో నెలకొన్నాయని తెలిపారు. డీఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని, అయితే ఈ ప్రక్రియలో కలెక్టర్, జిల్లా అధికారులు ఎక్కడైనా జోక్యం చేసుకున్నారానని ప్రశ్నించారు. ఈ వ్యవహారమంతా ఓ రిమోట్ కంట్రోల్ పాలనలా సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా మారిపోయాయని.. వీఆర్వో మొదలుకొని తహసీల్దార్, కలెక్టర్, చివరికి చీఫ్ సెక్రటరీ ఇలా అందరిపై మంత్రి లోకేశ్ పెత్తనమే నడుస్తోందని ఆరోపించారు. పోలీస్ శాఖలోనూ ఇదే తీరు నెలకొందని విమర్శించారు.
అవమానకరంగా ప్రవర్తించారు
ఈ విషయమై ప్రశ్నించేందుకు తమ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికెళ్తే, వారితో అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. సమాధానం చెప్పాల్సిన కమిషనర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్యాయంపై అభ్యర్థులు, నిరుద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తుంటే, బెదిరింపులకు ప్రభుత్వం దిగడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. విద్యార్థి విభాగ నేతలు నిరసన తెలుపుతుంటే అక్రమ కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాటికి భయపడేదిలేదని తేల్చిచెప్పారు. యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను సోమవారం ముట్టడించనున్నామని వెల్లడించారు. 2025 డీఎస్సీలో జరిగిన అన్యాయంపై అభ్యర్థుల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ప్రకటించారు. పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ సతీష్‌బాబు, నెల్లూరు నగర, సర్వేపల్లి, వెంకటగిరి, కందుకూరు, సూళ్లూరుపేట అధ్యక్షులు చంద్రారెడ్డి, జానకిరామ్‌రెడ్డి, మల్లికార్జున, అశోక్, తేజారెడ్డి, జిల్లా సెక్రటరీ నానీ, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శ్రీకృష్ణ, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నేతల నిరసన
అక్రమాలపై వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసనను తెలియజేస్తుంటే, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించారు. సర్కార్ అణచివేత ధోరణిని చూస్తుంటే నాటి బ్రిటిష్ పాలకుల రోజులు.. ఎమర్జెన్సీ నాటి ఘటనలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. చదువు, సంస్కారం లేని లోకేశ్‌కు విద్యా, మానవ వనరుల అభివృద్ధి శాఖను అప్పగించారని, సమాజంపై చంద్రబాబుకు ఎంత చులకన భావముందో దీని ద్వారా తెలుస్తోందని వివరించారు. లోకేశ్ చదివిన చదువులేంటో.. ఇతర దేశాల్లో ఆయన వెలగబెట్టిందేంటో అందరికీ తెలుసునని గుర్తుచేశారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన కన్వీనర్‌ను అర్ధాంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత మంది శాశ్వత ఉద్యోగులుండగా, వారిని పక్కనబెట్టి తాత్కాలిక సిబ్బందితో ప్రక్రియను ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. క్వశ్చన్ పేపర్‌ను అప్‌లోడ్ చేసిన తాత్కాలిక ఉద్యోగికి జిల్లాల్లో ప్రథమ స్థానం, రాష్ట్రంలో టాప్ ర్యాంక్ రావడం వెనుకన్న రహస్యమేమిటని నిలదీశారు. మెరిట్ జాబితాను ప్రకటించకుండా అభ్యర్థులకు ఉద్యోగమొచ్చిందంటూ మొదట మెసేజ్‌ను పంపి, ఆపై టెస్ట్ ఎస్సెమ్మెస్‌లని, మీకు కొలువు రాలేదని చెప్పడం మోసం కాదానని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉద్యోగులను ఏ విధంగా నియమించుకుంటారో, అదే తరహాలో ఉపాధ్యాయులను అపాయింట్ చేసినట్లు ఉందని విమర్శించారు.
అంతా లొసుగులమయం
మంత్రి లోకేశ్‌దే పెత్తనం
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ
ఆధ్వర్యంలో నిరసన
అరెస్ట్ చేసిన పోలీసులు
కాకాణి రాకతో వదిలేసిన వైనం
ఒకటిన కలెక్టరేట్ ముట్టడి


