ఏపీ పీజీ సెట్‌ ఫలితాల విడుదల | - | Sakshi
Sakshi News home page

ఏపీ పీజీ సెట్‌ ఫలితాల విడుదల

May 30 2026 12:11 AM | Updated on May 30 2026 12:11 AM

హిందీ విభాగంలో జిల్లా విద్యార్థినికి ప్రథమ ర్యాంక్‌

నెల్లూరు (టౌన్‌): వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పీజీ సెట్‌ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల ఎనిమిది నుంచి 11 వరకు నిర్వహించిన పరీక్షకు 632 మంది హాజరయ్యారు. వీరిలో 588 మంది అర్హత సాధించారు. 93.04 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. హిందీ విభాగంలో 94 మార్కులను హితశ్రీ సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్‌లో నిలిచారు.

స్టాఫ్‌ నర్సుల తుది మెరిట్‌ లిస్ట్‌..

గుంటూరు మెడికల్‌: పిడుగురాళ్ల జీజీహెచ్‌లో 150 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్‌ మెరిట్‌ లిస్టును విడుదల చేశామని ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు శోభారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో క్లరికల్‌, టైపోగ్రాఫికల్‌, తప్పిదాలు ఏమైనా ఉండి అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా శనివారం సాయంత్రం ఐదు గంటల్లోపు తెలియజేయాలని కోరారు. జాబితాను cfw. ap.nic.inలో అందుబాటులో ఉంచామని వివరించారు.

డీసీపల్లిలో 286

పొగాకు బేళ్ల విక్రయం

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 286 బేళ్లను శుక్రవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. వేలానికి 330 బేళ్లు రాగా, వీటిలో 286ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 39,548.4 కిలోల పొగాకును విక్రయించగా, రూ.89,30,393.10 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా కిలోకు రూ.250.. కనిష్టంగా రూ.190.. సగటు ధర రూ.225.81గా నమోదైందని వెల్లడించారు. తొమ్మిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు.

రామలింగేశ్వరస్వామి సేవలో..

విడవలూరు: మండలంలోని రామతీర్థంలో కొలువైన గంగా సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం సందర్శించారు. వీరికి ఆలయాధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. జడ్జి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇంధన పొదుపు బాటలో అమాత్యుడు

ఆత్మకూరు: ఇక నుంచి ఫ్రైడే.. నో ట్రావెల్‌ డేను పాటించేలా నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర ప్రయాణ పరిస్థితులు ఏర్పడితే ఎలక్ట్రిక్‌ వాహనాన్ని వినియోగించేలా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిర్ణయించారని ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రధాని మొదలుకొని సీఎంలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన విషయం విదితమే. అయితే మంత్రి ఆనం గత శుక్రవారం 11 వాహనాలతో ఆత్మకూరులో పర్యటించిన విషయమై ‘మేము చెబుతాం.. ఆచరించం’ అనే శీర్షికన సాక్షిలో కథనం గత శనివారం ప్రచురితమైంది. దీంతో ఆయన తన ప్రయాణ ఏర్పాట్లలో మార్పులు చేసుకున్నారు.

వేడుకగా జాతర

ఇందుకూరుపేట: మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ధూళి జాతరను అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం గ్రామోత్సవాన్ని జరిపారు. మేళతాళాలు, విద్యుద్దీపాలంకరణలు, బాణసంచా సందడితో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. దేవస్థాన చైర్మన్‌ గుండాల కృష్ణారెడ్డి, ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement