అధైర్యపడొద్దు.. అందుబాటులో ఉంటా | - | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. అందుబాటులో ఉంటా

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

కూటమి పాలనలో

అన్ని వర్గాలకూ కష్టాలే

జగన్‌ పాలనను కోరుకుంటున్న ప్రజలు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దనీ.. ఎలాంటి సమస్యలొచ్చినా తాను అందుబాటులో ఉంటాననీ.. అభివృద్ధి అంటూ జరిగిందంటే అది తమ ప్రభుత్వ హయాంలోనేనని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణం, పొడమేకలకండ్రిక గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన్ను గ్రామస్తులు కలిశారు. కూటమి ప్రభుత్వంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జగన్‌మోహన్‌రెడ్డి పాలన తిరిగి రావాలని కాకాణితో పేర్కొన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలను తెలియజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి పాలనపై ప్రజలకున్న భ్రమలు తొలగిపోయాయని.. డ్రామాలతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మహానాడుకు పట్టుమని పది మంది సైతం హాజరుకాలేదని.. సమావేశాలు వెలవెలబోయాయని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వారికి లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ, కనీస వసతులను కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా తానున్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి అండదండలతో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలకు భూ సమస్యల్లేకుండా చిత్తశుద్ధితో యత్నించామని, అధికార పార్టీ వారు ఇప్పుడు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా.. ప్రజలకు ఎవరు మేలు చేశారో అర్థమవుతోందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీటిని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అందించామని, అయితే ప్రస్తుతం కాలువల రిపేర్ల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు.

కూటమి పాలనపై విసిగిపోయిన ప్రజలు

కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పక్కా గృహాల నిర్మాణాలను నిలిపేసిందని, ప్రస్తుత సర్కార్‌పై ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు తమ హయాంలో నివేశన స్థలంతో పాటు పక్కా గృహాలను మంజూరు చేశామని తెలిపారు. అధికారమున్నా.. లేకపోయినా ప్రజలతోనే ఉంటామన్నారు. పొదలకూరులో ఇటీవల మృతి చెందిన పార్టీ నేత పడ్డాల వేమయ్య, పొడమేకలకండ్రికలో మృతి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రమణయ్య చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వాకాటి శ్రీనివాసులురెడ్డి, కేతు రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, అంజద్‌, ఖాదర్‌, కండే వాసు, వాకాటి శివారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లుగౌడ్‌, శ్రీనివాసులు, కోడూ రు మస్తాన్‌, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement