తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సూళ్లూరుపేట నియోజకవర్గ నేతలతో కలిసి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు.
ఆలయ సిబ్బందిపై
సస్పెన్షన్ వేటు
చిల్లకూరు: తీర ప్రాంతంలోని తూర్పుకనుపూరులో వెలసిన ముత్యాలమ్మ ఆలయంలో పనిచేసే సిబ్బందిపై సస్పెన్షన్ వేటేశామని ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. ఆలయం ప్రాంగణంలో లో గురువారం ఆయన మాట్లాడారు. ఆలయంలో డోలు వాయించే సిబ్బంది మణికంఠ విధి నిర్వహణలో కొంత కాలంగా అలసత్వం వహిస్తున్నారని, అమ్మవారి దర్శనానికి ఆదివారం వచ్చే భక్తులను టికెట్లు కొనుగోలు చేయనీయకుండా నేరుగా దర్శనానికి తీసుకెళ్తూ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. దీనిపై పలుమార్లు హెచ్చరించినా, ఎలాంటి మార్పు రాలేదన్నారు. మంగళవారం గట్టిగా ప్రశ్నించడంతో, దురుసుగా ప్రవర్తించారని వివరించారు. దీంతో అతడ్ని సస్పెండ్ చేస్తున్నట్లు పోస్ట్ ద్వారా బుధవారం సమాచారమివ్వడంతో పాటు వాట్సాప్ ద్వారా తెలియజేశామని చెప్పారు. కాగా తనను ఈఓ కులం పేరుతో తన కుటుంబసభ్యుల ఎదుట దూషించారంటూ చిల్లకూరు పోలీసులకు మణికంఠ ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆలయ కమిటీ ఏర్పాటయ్యాక ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
లభించని
మత్స్యకారుల ఆచూకీ
● విస్తృతంగా గాలింపు చర్యలు
బిట్రగుంట: బోగోలు మండలం అలిచెర్లబంగారుపాళెంలో సముద్రంలో చేపల వేటకెళ్లి గల్లంతైన అన్నదమ్ములు గణేష్, రాజా ఆచూకీ గురువారం సాయంత్రానికీ లభ్యం కాలేదు. అలిచెర్లబంగారుపాళేనికి చెందిన తూపిలి బాలమురళి (51), కుమారి గోవిందు (42), సోదరులైన తులసింగారి రాజు, గణేష్ రెండు చెక్క తెప్పలపై వేటకు బుధవారం వేకువజామున వెళ్లి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో వచ్చిన పెనుగాలులకు పడవ తిరగబడి బాలమురళి, గోవిందు మృతి చెందగా, తులసింగారి రాజు, గణేష్ ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం గాలింపు చర్యలను మైరెన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు బుధవారం ఉదయం నుంచే విస్తృతంగా చేపట్టారు. మరో పది ఫైబర్ బోట్లతో గాలింపు చర్యలను గురువారం చేపట్టినా, ఫలితం లేకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. గల్లంతైన రాజు, గణేష్ క్షేమంగా తిరిగి రావాలని తీరమంతా కడలికి కన్నీటితో మొక్కుతోంది. కాగా బాలమురళి, గోవిందు మృతదేహాలకు కావలి ఏరియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించారు. మృతుల కుటుంబాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, సీఎం ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని అందించి ఆదుకుంటామని తెలిపా రు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అదనపు బల గాలను సిద్ధం చేయనున్నామని వివరించారు.
విషాద తీరం
బోగోలు మండలంలోని తీర ప్రాంత గ్రామాలు విషాదఛాయల్లోనే ఉన్నాయి. సముద్రంలో ఆటుపోట్లు, తుఫాన్ల సమయంలోనూ వేటకెళ్లి క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు ఊహించని రీతిలో పెనుగాలులకు బలైపోవడం ప్రతి ఒక్కర్నీ కలిచివేస్తోంది. సముద్రంలో అలల ఉధృతి, గాలి వేగాన్ని బట్టి వేటకెళ్లాలా.. వద్దా అని నిమిషంలో నిర్ణయించుకునే నేర్పు ఇక్కడి మత్స్యకారుల సొంతం. అలాంటిది ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వేటకెళ్లడం, గంటలోనే అంతా తారుమారు కావడాన్ని ఇక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడే కడలే తమ జీవితాల్లో కన్నీటిని నింపిందని మృతుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. రాజు, గణేష్ కుటుంబాలు ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుమిలిపోతున్నాయి.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. స్వామివారిని 87,691 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 49,958 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభి స్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది.ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


