● వెంకటగిరి నియోజకవర్గంలో
వెలుగుచూస్తున్న అక్రమాలు
● వెంకటరామరాజుపేటలో సీనియర్ మేట్లదే పెత్తనం
● సిబ్బంది చేతివాటం
కలువాయి(సైదాపురం):వెంకటగిరి నియోజకవర్గంలో ఉపాధి పథకం అవినీతిమయంగా మారింది. కలువాయి మండలంలో అర్హత కలిగిన నిరుపేద కూలీలు కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్, జూనియర్ మేట్ల పెత్తనమే సాగుతోంది. తమ కుటుంబసభ్యుల పేర్లపై సెపరేటుగా ఫేస్ అటెండెన్స్ తీసుకొని బినామీ మస్తర్లేసి నిధులను దిగమింగుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మండలంలోని చింతలపాళెం పంచాయతీ మజరా గ్రామ మైన వెంకటరామరాజుపేటలో సీనియర్ మేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులు, బంధువులకు మస్తర్లేసి పనిచేసిన విధంగా చూపిస్తున్నారని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. సదరు మేట్ కుమారుడు బీటెక్ చదువుకుంటున్నా, మస్తర్లో పేర్లు నమోదు చేయడం గమనార్హం.
గతంలో నాటిన మొక్కలకు నేడు బిల్లులు
నిమ్మ, మామిడి తోటల అభివృద్ధిలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటేందుకు గుంతలు తీసిన నాటి నుంచి మూడేళ్ల పాటు వాటి సంరక్షణకు నిధులను రైతులకు మంజూరు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని చేతివాటాన్ని ఉపాధి సిబ్బంది ప్రదర్శించారు. వెంకటరామరాజుపేటకు చెందిన జాబ్‌కా ర్డు 20087 పొట్టపల్లి చెంచయ్య వర్క్ ఐడీ 02090220010 – ఐఎఫ్ – జీఐఎస్ – 1078645, మరో జాబ్‌కార్డు నంబర్ 20085 పొట్టపల్లి యానాద య్య వర్క్ ఐడీ 02090220010 – ఐఎఫ్ – జీఐఎస్ – 1078652కు మూడేళ్ల క్రితం నాటిన నిమ్మ మొక్కలకు ఈ ఏడాది నాటిన తరహాలో చూపి బిల్లులు మంజూరు చేశారు.
రోజా మొక్కలకూ..
కలువాయి మండలంలో రోజా మొక్కలు నాటిన వారికి సైతం బిల్లులు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెంకటరామరాజుపేటలో విరివిరు చిన్నమ్మ జాబ్‌కార్డు నంబర్ 20126 ఫోర్లికల్చర్ పేరిట వర్క్ ఐడీ నంబర్ 0209022010 – ఐఎఫ్ – 19187012063272కు రోజా మొక్కలు నాటినట్లు చూపి మెటీరియల్ పేమెంట్ కింద గత ఫిబ్రవరి తొమ్మిదిన రూ.60 వేలను కలువాయి ఎమ్సీసీలో నమోదు చేశారు. అసలు రోజా మొక్కలను నాటకుండానే బిల్లులను దిగమింగారు.
భయమేదీ..?
కలువాయి మండలంలో గతంలో పనిచేసిన ఇద్దరు టీఏలు, ఈసీ, కంప్యూటర్ ఆపరేటర్లు అవినీతికి పాల్పడి టెర్మినేటయ్యారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది ఏ మాత్రం భయపడకుండా ఆడిట్ అధికారులను సైతం మేనేజ్ చేస్తూ అవినీతికి అందలమేస్తున్నారు.


