●
చేనేతలను ఆదుకోవాలి
చేనేత కార్మికులను ఆదుకోవాలి. వేసవి కాలంలో వారు మగ్గం నేసేందుకు అవకాశం లేదు. గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా కార్మిక కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయినా పట్టించుకోవడం లేదు. చేనేతల కార్పొరేషన్లను పెంపొందించి నిధులను విడుదల చేయాలి.
– కోనం చినబ్రహ్మయ్య,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర చేనేత విభాగం
కార్యదర్శి
పింఛన్లు మంజూరు చేయడం లేదు
నేతన్న నేస్తం కింద ప్రస్తుత ప్రభుత్వం చేనేతలను ఆదుకోవాలి. చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు పథకాన్ని అమలు చేయలేదు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. కొత్తగా పింఛన్లను కూడా మంజూరు చేయడం లేదు.
– పముజుల శంకరయ్య, చేనేత
ఐక్యవేదిక నాయకుడు, పొదలకూరు
పొదలకూరు: చేనేత కార్మికుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆ కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంతోనే సరిపెడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా గత ప్రభుత్వంలో అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని తిరిగి ప్రారంభించలేదని వారు విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు కార్మికులను ఆదుకునేందుకు ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని మండిపడుతున్నారు. అలాగే 50 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 17 కులాలకు చెందిన వేలాది మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కేవలం రెండు కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసిందని నాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి పదవులను చేనేత వర్గాలకు కట్టబెట్టినట్లు గుర్తుచేస్తున్నారు.
సాయం కోసం..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 వేల మగ్గాలు ఉండగా.. ఒక్క నెల్లూరు జిల్లాలోనే దాదాపు 3 వేలు ఉన్నాయి. పనుల్లేని సమయంలో కార్మికులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద ఐదేళ్లపాటు ప్రతి ఏడాది రూ.24 వేలు చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. కరోనా కష్టకాలంలో కూడా జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ పథకాన్ని అమలు చేసి చేనేత కుటుంబాలకు ఉపశమనం కల్పించింది. ఈ లెక్కన ఐదేళ్లలో అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి సుమారు రూ.1.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందింది.
గతంలో నాలుగు కార్పొరేషన్లు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేనేత వర్గాలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పద్మశాలి, తొగట, దేవాంగ, కుర్మి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన చేనేత వర్గాల నాయకులకు కూడా కార్పొరేషన్ డైరెక్టర్ పదవులిచ్చి రాజకీయంగా గుర్తింపు కల్పించిచారు. దీంతో గ్రామీణ స్థాయిలో చేనేత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం లభించింది. అయితే కూటమి ప్రభుత్వం కేవలం దేవాంగ, పద్మశాలి కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసింది. కుర్మి కార్పొరేషన్‌కు డిమాండ్ పెరగడంతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ద్వారా కార్మికులకు ఉపయోగపడే పథకాలు అమలు చేసిన దాఖలాల్లేవు. ప్రభుత్వం ఇప్పటికై నా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు.
రెండేళ్లుగా నేతన్న నేస్తం పథకం ఎగనామం
గతంలో ఏడాదికి రూ.24 వేలు
బ్యాంక్ ఖాతాల్లో జమ
కరోనా కష్టకాలంలోనూ అండగా నిలిచిన జగన్ ప్రభుత్వం
ఉచిత విద్యుత్‌తో సరిపెడుతున్న కూటమి సర్కారు
కార్పొరేషన్ల ఏర్పాటులోనూ
వెనుకబాటుతనం
సాయం కోసం ఎదురుచూస్తున్న చేనేత కార్మికులు
నేడు ఇదీ పరిస్థితి
అయితే ప్రస్తుతం చేనేత కార్మికులకు ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదని వారు చెబుతున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు గత ప్రభుత్వానికి మించిన స్థాయిలో చేనేతలకు ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని, 50 ఏళ్ల వయస్సు నిండిన నేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాజకీయ, సామాజిక పరంగా చేనేత వర్గాలను బలోపేతం చేసేందుకు 17 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శిస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తప్ప మిగిలిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు.


