● స్వల్పగాయాలతో బయటపడిన టూరిస్టులు
● బాధితులకు ఆర్డీఓ,
రూరల్ ఎమ్మెల్యే పరామర్శ
బస్సును పరిశీలిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
ఆస్పత్రి బయట ఉన్న టూరిస్టులు
నెల్లూరు(క్రైమ్): వారంతా బంధువులు. ఏటా వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలోని వేళాంగణి మాతను దర్శించేందుకు వెళ్తుంటారు. ఈసారి పది కుటుంబాలు కలిసి ఏలూరుకు చెందిన టూరిస్టు బస్సులో వేళాంగణి మాత దర్శనం కోసం వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో రైలింగ్‌ను ఢీకొట్టాడు. దీంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలు కాగా మిగిలిన అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. ఏలూరు మండలం ప్రతికోలంక గ్రామానికి చెందిన బి.సాయిసోమేశ్వరరావుకు పెద్దపాడు మండలం గుడిపాడులో బంధువులున్నారు. వారందరూ ప్రతి సంవత్సరం వేసవిలో వేళాంగణిమాతను దర్శించుకునేవారు. ఎప్పటిలాగే ఈసారి పది కుటుంబాలు ఏలూరుకు చెందిన టూరిస్టు బస్సులో బుధవారం సాయంత్రం బయలుదేరారు. డ్రైవర్ అప్పారావు ఒంగోలు వరకు బస్సును నడిపారు. అక్కడ్నుంచి కో డ్రైవర్ దుర్గా బస్సును నడపసాగాడు. గురువారం తెల్లవారుజామున చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు (మెడికవర్ హాస్పిటల్ దాటగానే) సమీపంలో డ్రైవర్ నిద్రమత్తులో జాతీయ రహదారి వెంబడి ఉన్న రైలింగ్‌ను ఢీకొన్నాడు. బస్సును అదుపు చేయలేకపోవడంతో రోడ్డుపక్కన మార్జిన్‌లో బోల్తాపడింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దశద్దం వచ్చింది. టూరిస్టులు పెద్దగా కేకలు వేశారు.
స్పందించిన పోలీసులు
కొద్దిదూరంలో విధుల్లో ఉన్న ఎస్సై విజయకుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాత్రి గస్తీ విధుల్లో ఉన్న నెల్లూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ వేణు, బాలాజీనగర్, నెల్లూరు నార్త్, సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సాంబశివరావు, రామకృష్ణ, వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు, బస్సులోని యువకులు అద్దాలను పగులగొట్టి అందులోని వారిని బయటకు తీసుకొచ్చారు. 16 మందికి గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. క్షతగాత్రుల్లో సాయి సోమేశ్వరరావు, రాజ్‌ప్రకాష్, విద్యాచరణ్, ప్రవీణ్‌పాల్, ధర్మావతి, నాగమణి, శ్రీలత, గీతిక, దివ్య, ఆనంది, మురళీమోహన్, శ్రావణి, లక్ష్మి, పావనీని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. డ్రైవర్ అప్పారావు, దుర్గా, వంట మనుషులు సూరిబాబు, నరసమ్మను 108లో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో క్షతగాత్రులు, టూరిస్టులను నెల్లూరు ఆర్డీఓ అనూష, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరామర్శించారు.
కేసు నమోదు
బోల్తాపడిన బస్సును క్రేన్ల సాయంతో అక్కడ్నుంచి తీసుకెళ్లారు. సాయిసోమేశ్వరరావు ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ దుర్గాపై నార్త్ ట్రాఫిక్ ఎస్సై సైదులు కేసు నమోదు చేశారు. అతను మద్యం తాగాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. టూరిస్టులను ప్రత్యేక వాహనంలో స్వగ్రామాలకు తరలించేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.


