సైదాపురం: మండలంలోని కొమ్మిపాడు గ్రామంలో శుక్రవారం జరిగే పల్లె వీక్షణం కార్యక్రమానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా వస్తారని ఎంపీడీఓ ఎంవీ రామ్మోహన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులతోపాటు చెత్త నుంచి సంపద తయారీ, అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రం, స్వర్ణగ్రామ కార్యాలయాల పనితీరును పర్యవేక్షిస్తారన్నారు. స్వయం సహాయక సంఘాలు, ఛాంపియన్ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. అనంతరం మండల స్థాయిలో పదో తరగతి పరీక్షల్లో టాప్ త్రీ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రైతు విభాగ సంయుక్త కార్యదర్శిగా సుంకర
నెల్లూరురూరల్: వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కావలి నియోజకవర్గానికి చెందిన సుంకర వెంకట దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
వైద్యం అందక వ్యక్తి మృతి
● నర్రవాడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యమని
బంధువుల ఆరోపణ
దుత్తలూరు: మండలంలోని నర్రవాడకు చెందిన రసూల్ (55) అనే వ్యక్తి వైద్య చికిత్స అందక మృతిచెందాడు. ఈ ఘటనలో స్థానిక పీహెచ్‌సీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు.. రసూల్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి బాత్‌రూంలో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే అతడిని కారులో నర్రవాడ పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది సరైన సమయంలో స్పందించలేదని, పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు అతడిని వెంటనే దుత్తలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే రసూల్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. సకాలంలో చికిత్స అందించి ఉంటే రసూల్ బతికే అవకాశం ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్రవాడ పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై వైద్యాధికారులు, సిబ్బంది స్పందించారు. ఆ సమయంలో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్నామన్నారు. రసూల్‌ను ఆస్పత్రిలోకి తీసుకురాకుండా రోడ్డుపైనే ఉంచి బీపీ చెక్ చేయాలని మాత్రమే చెప్పారని, అదే సమయంలో అత్యవసర రోగుల చికిత్సలో తాము ఉన్నామని వివరించారు. ఐదు నిమిషాల్లో బీపీ చెక్ చేస్తామని చెప్పినా వారు వినిపించుకోకుండా వెళ్లిపోయారని సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనలో తమ తప్పు లేదని వైద్యశాల సిబ్బంది అంటున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వైద్య నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
జామాయిల్ తోటల దగ్ధం
● భారీగా ఆస్తి నష్టం
పొదలకూరు: మండలంలోని నావూరు గ్రామంలో ముగ్గురు రైతులకు చెందిన సుమారు 75 ఎకరాల కోతకు వచ్చిన జామాయిల్ తోటలు గురువారం దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు బాధిత రైతులు వెల్లడించారు. గ్రామానికి చెందిన బొడ్డు నరసింహులు 50 ఎకరాలు, మక్కిన వెంకటేశ్వర్లు 15 ఎకరాలు, రామ్మోహన్ 10 ఎకరాల తోటలు తగులబడ్డాయి, గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారా?, లేక ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందా? తెలియడం లేదంటున్నారు. సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్టుగా బాధితులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పొదలకూరు అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. జామాయిల్ తోటలు తగులబడటంపై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు నరసింహులు వెల్లడించారు.
కండలేరులో
39.430 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం 39.430 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగకాలువకు 1,900, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.90 సన్నవి : రూ.50
పండ్లు : రూ.20


