నెల్లూరు(వేదాయపాళెం): ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆరంభంలోనే అన్నదాతకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్రకృతి విపత్తులు, పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ ఎరువులు, సాగునీరు సకాలంలో అందక మరింత ఆందోళన నెలకొంది. దీనికితోడు ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు. వాతావరణ నిపుణులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని జిల్లాకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర ఇబ్బందులు
అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 3.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు అవుతోంది. అదనంగా మరో 2 లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి, వేరుశనగ, మిరప పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పలు ఆయకట్టు గ్రామాలకు ఇప్పటికీ సాగునీరు అందడం లేదు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అనేక మండలాల్లో అన్నదాతలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ జలవనరుల శాఖ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది.
ఎరువుల సరఫరా అంతంతమాత్రమే
కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగిన సమయంలో రైతులకు సబ్సిడీ యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఎకరాకు 200 నుంచి 250 కిలోల వరకు యూరియా అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం 120 కిలోల వరకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపు కొంటున్నారని విమర్శలున్నాయి. దీంతో మిగతా అవసరమైన యూరియాను ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుకాణదారులు సూచించిన బ్రాండ్లనే వారు చెప్పిన ధరలకు కొనక తప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
పంటలకు ముప్పు
ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఎండ వేడిమి, వడగాలుల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. పంటలకు ‘బెట్ట’ తగిలి దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్‌నినో తీవ్రతకు తోడు గాలులు ఎక్కువైతే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ప్రతికూల పరిస్థితులు, ఎరువుల కొరత, సాగునీటి సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అనేక ఆటుపోట్ల మధ్య రైతులు ఈ ఖరీఫ్‌లో ఎదురీత వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం
దిగుబడులు గణనీయంగా
తగ్గే అవకాశం
ఆదుకునేందుకు ప్రభుత్వ
సహకారం శూన్యం
పంటలను సంరక్షించుకోవాలి
ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు తగిన జాగ్రత్తలు పాటించి పంటలను సంరక్షించుకోవాలి. ఎల్‌నినో ప్రభావం ఖచ్చితంగా ఖరీఫ్‌పై ఉంటుంది. అందువల్ల చిన్నపాటి మెళకువలతో పంటలను సంరక్షించుకుంటూ అధిక దిగుబడులు సాధించేందుకు కృషిచేయాలి. బెట్ట తట్టుకునేందుకు పొటాషియం నైట్రేట్‌ను వినియోగించాలి. ఎండ సమయంలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో సాగునీరు అందించాలి. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్ల ద్వారా నీటిని వినియోగిస్తే వేసవిలో నేల పొడిబారి పోకుండా పంటలను కాపాడుకోవచ్చు. – యు.వినీత,
ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ
పరిశోధన స్థానం, నెల్లూరు


