లేబూరు గ్రామంలో కలకలం | - | Sakshi
Sakshi News home page

లేబూరు గ్రామంలో కలకలం

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

చిన్నారి అపహరణ యత్నమంటూ ఆరోపణలు

అప్రమత్తమైన గ్రామస్తులు

అనుమానిత మహిళల పట్టివేత

చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన

ఇందుకూరుపేట: మండలంలోని లేబూరులో గురువారం ఆటోలో సంచరిస్తున్న నలుగురు మహిళలు చిన్నారులను అపహరించేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు.. ఉదయం వేళ ఆటోలో నలుగురు మహిళలు వచ్చి వీధుల్లో తిరగసాగారు. ఇసుకలో ఓ పిల్లాడు ఆడుకుంటుండగా పిలిచారు. అతను అరుస్తూ ఇంట్లోకి వెళ్లి చెప్పగా తల్లి వచ్చి వారిని ప్రశ్నించింది. అయితే మహిళలు పొంతన లేని సమాధానమిచ్చారు. విషయం తెలుసుకున్న యువకులు, పెద్దలు వెంటనే అక్కడికి చేరుకుని మహిళలను అడ్డగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. దార్ల శ్రీదేవి, దార్ల తిరపతమ్మ, దార్ల జయమ్మ, దార్ల లక్ష్మిగా గుర్తించినట్లు సమాచారం. వీరిలో శ్రీదేవి, తిరపతమ్మపై గతంలోనే ఇందుకూరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

స్థానికుల్లో భయం

స్థానికుల ఆరోపణల ప్రకారం ఇదే ముఠా గతంలో కూడా చిత్తుకాగితాలు ఏరుకునే గిరిజనులను అపహరించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అప్పట్లో గ్రామస్తుల అప్రమత్తతతో ఆ యత్నం విఫలమైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. లేబూరులో ఈ ఘటన తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

పోలీసుల విచారణ కొనసాగుతోంది

ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మహిళలు నిజంగా చిన్నారుల అపహరణకు యత్ని ంచారా లేదా ఇతర కారణాలతో గ్రామంలో తిరిగారా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. వారి గత చరిత్రతోపాటు ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement