● వ్యక్తిపై బీరు బాటిల్‌తో దాడి
ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని ఏసీఎస్‌ఆర్ కాలనీలో గురువారం సాయంత్రం గంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. దుకాణం వద్ద నిలబడి ఉన్న వ్యక్తిపై బీరు బాటిల్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఏసీఎస్‌ఆర్ కాలనీకి చెందిన కరిముల్లా చిల్లర దుకాణానికి వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన సుమంత్ అనే యువకుడు గంజాయి మత్తులో కాస్త దూరంలో ఉన్నాడు. అప్పటికే అతడు పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తూ దాడికి యత్నిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారించేందుకు ప్రయత్నించిన వారిపై దాడికి పాల్పడేందుకు వస్తుండటంతో పలువురు పారిపోయారు. ఈ క్రమంలో కరిముల్లా దుకాణం వద్ద నిలబడి ఉండగా, సుమంత్ ఖాళీ బీరు బాటిల్‌తో అతడి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కరిముల్లాను సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడి చేసిన యువకుడు మత్తులోనే అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై జంపనీ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సుమంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఏసీఎస్‌ఆర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. గంజాయి మత్తులో యువకుల ప్రవర్తనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దాడికి పాల్పడిన సుమంత్
గాయపడిన కరిముల్లా


