బోగోలు తీరంలో పెను విషాదం | - | Sakshi
Sakshi News home page

బోగోలు తీరంలో పెను విషాదం

May 28 2026 12:52 AM | Updated on May 28 2026 12:52 AM

పడవల్లో వెళ్లి ఉంటే.. బతికేవారు..

తెప్పలపై చేపల వేటకు వెళ్లి

ఇద్దరు మృత్యువాత

మరో ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు

కుప్పకూలిన కుటుంబాలు

తెప్ప ఒరిగింది.. తీరం విలపించింది. కడలినే నమ్ముకుని బతికిన కుటుంబాలను ఆ కడలే కబళించింది. ఆకలి వేటలో మృత్యు వలలో చిక్కి ఆశలే కూలిపోయాయి. విరుచుకుపడిన రాకాసి గాలులకు గుండెలు తల్లడిల్లాయి. వేకువ వెలుగులో.. కన్నీటి చీకట్లు అలముకున్నాయి. చేపల కూర కోసం తెప్పలపై వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారుల్లో ఇద్దరు మృత్యు వాత పడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనతో బోగోలు తీరంలో తీవ్ర విషాదం నెలకొంది.

బిట్రగుంట: బోగోలు మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు రెండు తెప్పల్లో వేటకు వెళ్లగా ఈదురుగాలుల రూపంలో మృత్యువు సముద్రంలో వీరికి ఎదురొచ్చింది. వేకువన నాలుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు తెప్ప బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు చనిపోగా, రెండో తెప్పలో అన్నదమ్ములైన మరో ఇద్దరు మత్స్యకారులు కూడా గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే తీరం తల్లడిల్లిపోయింది. వందలాది మంది మత్స్యకారులు తీరానికి చేరుకుని గొల్లుమన్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం అమల్లో ఉండడంతో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లడం లేదు. వలలు, పడవలు బాగు చేసుకుంటూ కడలి తీరాన సేద తీరుతున్నారు.

పిల్లలు చేపల కూర అడిగారని..

దాదాపు నలభై రోజులకు పైగా వేటకు వెళ్లకపోవడం, పిల్లలు, కుటుంబ సభ్యులు చేపల కూర తినాలని అడిగారని అలిచెర్లబంగారుపాళెంకు చెందిన తూపిలి బాలమురళి (51), కుమారి గోవిందు (42)తోపాటు అదే గ్రామానికి చెందిన తులసింగారి రాజు, గణేష్‌ వేట నిబంధనల మేరకు తీరంలో బుధవారం వేకువన 3 గంటలకు రెండు కొయ్య తెప్పలపై వేటకు వెళ్లారు. తీరం వెంబడి కావడంతో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో బలమైన ఈదురు గాలులు వీయడంతో తెప్పలు తిరగబడడంతో బాలమురళి, గోవిందు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం సమయానికి పాతపాళెం సమీపంలో తీరానికి వీరి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. మరో తెప్పలో ఉన్న రాజు, గణేష్‌ ఆచూకీ బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా లభ్యం కాలేదు. ఈదురు గాలల తాకిడికి తెప్ప దూరంగా వెళ్లి ఉంటుందనే ఉద్దేశంతో మైరెన్‌ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు మృత్యువాత పడడం, మరో ఇద్దరు గల్లంతు కావడంతో అలిచెర్లబంగారుపాళెం కన్నీటి సంద్రంగా మారింది. ఎవరిని కదిలించినా కన్నీరు తప్ప మాటలు రావడం లేదు. కంటికి రెప్పలా కాపాడే సముద్రమే కాటేసిందని కన్నీరు మున్నీర వుతున్నారు. మృతి చెందిన బాలమురళికి భార్య, ఇ ద్దరు పిల్లలు ఉండగా, గోవిందుకు కూడా భార్య ఇ ద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన రాజుకు భార్య, ఇ ద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. రాజు సోదరుడైన గణేష్‌ కు ఇంకా పెళ్లి కాలేదు. ఆయా కుటుంబాలకు వీళ్లే ఆధారం. ప్రస్తుతం వేట నిషేధ సమయం కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దుర్ఘటనతో ఆయా కుటుంబాలు కుప్పకూలిపోయాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.

తెల్లారేసరికి వస్తామన్నారు..

ప్రస్తుతం వేట నిషేధం కావడంతో బతుకుతెరువు కోసం కానీ.. ఇంట్లో అవసరాలకు తెప్పలపై వేట చేసే అవకాశం ఉండడంతో నలుగురు మత్స్యకారులు కూర కోసం చేపల వేటకు తెప్పలపై వెళ్లి మృత్యువాత పడ్డారని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. పడవల్లో వెళ్లి ఉంటే.. బతికే వారన్నారు. వేట నిషేధ నిబంధనల మేరకే తెప్పలపై వెళ్లి వేట చేసుకోవడం నేరం కాదని మత్స్యశాఖాధికారులు చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డారని తెలిసిన వెంటనే మత్స్యశాఖ అధికారులు, బిట్రగుంట పోలీసులు, మైరెన్‌ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు బీమా పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మత్స్యశాఖ కావలి ఏడీ చాంద్‌బాషా తెలిపారు.

సముద్రంలో వేట.. ఆటు పోట్లకు ఎదురెళ్లడం మత్స్యకారులకు అలవాటే. వేట నిషేధంతో ఖాళీగా ఉంటున్నా.. అప్పుడప్పుడూ చెక్క పడవలపై సరదాగా సముద్రంలోకి వెళ్లి.. ఇంట్లో కూర కోసం చేపలు తెచ్చుకోవచ్చు. అందులో భాగంగానే వేకువన 3 గంటల ప్రాంతంలో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండడంతో నలుగురు మత్స్యకారులు రెండు తెప్పలపై వేటకు వెళ్లారు. వీరు వేటకు వెళ్లిన కొద్ది సేపటికే వాతావరణం భీతావాహకంగా మారడంతో కుటుంబ సభ్యులకు క్షణమొక యుగంగా మారింది. తమ వాళ్లు వెనక్కి వచ్చేయాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉదయం వరకు ఎదురుచూశారు. ఉదయం ఆరు గంటలు అయినా.. తమ వాళ్లు రాకపోవడంతో తీరానికి వెళ్లి చూసినా.. కనుచూపులో వీరి జాడ కనిపించకపోవడంతో క్షణక్షణానికి ఆందోళన, భయంతో వణికిపోయారు. తీరానికి తెప్పలు కొట్టుకురావడంతో తమ వారు ప్రాణాలతో లేరని తెలిసి నలుగురి కుటుంబాలు తల్లడిల్లిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement